స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాల్లో తెలంగాణ సత్తా

ABN , First Publish Date - 2022-09-25T09:04:14+05:30 IST

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ శనివారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాల్లో తెలంగాణ సత్తా చాటింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాల్లో తెలంగాణ సత్తా

  • రాష్ట్రంలోని 16 మునిసిపాలిటీలకు అవార్డులు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):  కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ శనివారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రానికి చెందిన 16 మునిసిపాలిటీలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యాయి. 2021 జూలై 1 నుంచి 2022 జనవరి కాలానికి ఈ పురస్కారాలు ప్రకటించారు. ఆదిభట్ల, బడంగ్‌పేట, భూత్పూర్‌, చండూరు, చిట్యాల, గజ్వేల్‌, ఘట్‌కేసర్‌, హుస్నాబాద్‌, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరెడ్‌చర్ల, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, సిరిసిల్ల, తుర్కయాంజాల్‌, వేములవాడ మునిసిపాలిటీలకు అవార్డులు వరించాయి. 16 మునిసిపాలిటీలకు పురస్కారం దక్కడం పట్ల సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనమని కేసీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో గుణాత్మక దిశగా సాగుతున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద వివిధ విభాగాల్లో రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ అధికారులు, సిబ్బందికి సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మరోపక్క, స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు పొందిన ఆయా మునిసిపాలిటీల అధికారులకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 

Updated Date - 2022-09-25T09:04:14+05:30 IST