హిమగిరుల్లో.. తెలంగాణ రుచులు!

ABN , First Publish Date - 2022-05-26T11:22:36+05:30 IST

సిద్దిపేట, ఆంధ్రజ్యోతి, మే 25: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌ ఆలయం హిమాలయ పర్వతాల్లోని మంచుకొండల్లో ఉంటుంది. అక్కడి పరమశివుడిని

హిమగిరుల్లో.. తెలంగాణ రుచులు!

- కేదార్‌నాథ్‌లో సిద్దిపేట వాసుల నిత్యాన్నదానం  

- 4 వేల మందికి మూడు పూటలా భోజనం 

- జూన్‌ 15 వరకు కొనసాగింపు  

సిద్దిపేట, ఆంధ్రజ్యోతి, మే 25: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌ ఆలయం హిమాలయ పర్వతాల్లోని మంచుకొండల్లో ఉంటుంది. అక్కడి పరమశివుడిని దర్శించుకోవడం ఒక సాహసమే. ఎత్తయిన శీతల పర్వతాల మధ్యన కిలోమీటర్ల కొద్దీ కాలినడనక ప్రయాణం చేస్తేనే పరమేశ్వరుడి దర్శనభాగ్యం కలుగుతుంది. అలాంటి చార్‌ధామ్‌ యా త్రలో కీలకమైనది జ్యోతిర్లింగ ఆలయం. అక్కడికి ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఇలాంటి వారందరి కోసం సిద్దిపేటవాసులు నిత్యాన్నదానం చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. కేదార్‌నాథ్‌ (సోన్‌ ప్రయాగ్‌ బేస్‌ క్యాంపు వద్ద)లో ఏర్పాటు చేసిన తొలి అన్నదాన లంగర్‌ సిద్దిపేటదే కావడం విశేషం. 2019లో తొలిసారి విజయవంతంగా నిర్వహించగా, కరోనా కారణంగా రెండేళ్లు ఆగింది. ఈనెల 4 నుంచి ప్రారంభమైన అన్నదానం జూన్‌ 15 వరకు కొనసాగుతుంది. ఈ ఆలయ దర్శనం ఆరునెలల పాటు ఉన్నా తొలి రెండు నెలలే కీలకం. అందుకే ఈ రెండు నెలలపాటే లంగర్‌ కొనసాగుతుంది. సిద్దిపేటకు చెందిన వ్యాపారి చీకోటి మధుసూదన్‌ ఈ కేదార్‌నాథ్‌ అన్నదాన సమితికి అధ్యక్షుడిగా అన్నీతానై వ్యవహరిస్తున్నారు. 

అర్ధరాత్రి 12 గంటల వరకు.. 

ప్రతీరోజు తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమయ్యే వడ్డన అర్ధరాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకు కాఫీ, టీ, టోస్‌ బిస్కట్‌, స్వీటు, ఉదయం 7 గంటలకు ఇడ్లీ, వడ, పోహ, ఊతప్ప, ఉప్మా, దోశ, స్వీటు, మైసూర్‌ బజ్జీ, మధ్యాహ్నం 12గంటలకు అన్నం, అవకాయ, పప్పు, కుర్మా, సాంబార్‌, పాపడ్‌, స్వీటు, పెరుగు, 4 గంటలకు సిద్దిపేట స్పెషల్‌ చాట్‌, ప్రేమ్‌నగర్‌ పూరి, కచోరి, పావుబజ్జీ, మినప వడలు, ఆలుబజ్జీలు, పానీపూరి, 7గంటలకు అన్నం, పప్పు, సాంబారు, పాపడ, ఊతప్ప, ఇడ్లీ, వడ, చపాతి, నాన్‌, తందూరి వడ్డిస్తున్నారు. కేదార్‌నాథ్‌లో అన్నదానం చేయడానికి ఆర్థిక తోడ్పాటే కాదు.. నిరంతరం సేవ చేయడంలోనూ సిద్దిపేటవాసులు ముందున్నారు. వంద మందికి పైగానే నిరంతరం సేవ చేస్తున్నారు. నిత్యం 200 మందికి ఉచితంగా వసతిని కూడా కల్పిస్తున్నారు. 

సంకల్ప బలమే నడిపించింది

కేదార్‌నాథ్‌లో నిత్యం 4వేల మందికి ఉచితంగా భోజనం పెడుతున్నామంటే ముమ్మాటికీ దైవ సంకల్పమే. సమితి సభ్యులు, దాతల సహకారం, మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. మైనస్‌ డిగ్రీల చలి ఉన్నా పట్టుదలతో పనిచేస్తున్నాం. ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాం. 

- చీకోటి మధుసూదన్‌, అధ్యక్షుడు, కేదార్‌నాథ్‌ అన్నదాన సేవాసమితి, సిద్దిపేట

Updated Date - 2022-05-26T11:22:36+05:30 IST