రాష్ట్రమంతటా వర్షాలు

ABN , First Publish Date - 2020-07-16T13:19:47+05:30 IST

భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బుధవారం కురిసిన జడివాన ధాటికి రోడ్లపై నీళ్లు ..

రాష్ట్రమంతటా వర్షాలు

భారీ వర్షాలకు రోడ్లు జలమయం

పొంగిపొర్లిన వాగులు, వంకలు

పలు జిల్లాల్లో పంటలకు నష్టం

25 గ్రామాలకు రాకపోకలు బంద్‌

ప్రాజెక్టులకు పోటెత్తిన వరదనీరు

నిండుతున్న ఆలమట్టి, జూరాల   

జీహెచ్‌ఎంసీలో ఎల్లో వార్నింగ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బుధవారం కురిసిన జడివాన ధాటికి రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో మురుగునీరు, వర్షపు నీరు పోయే వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇళ్లలోకి ఆ నీరు చేరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బాలానగర్‌లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, అత్యల్పంగా మూసాపేట సర్కిల్‌ పరిధిలోని అల్లాపూర్‌లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌ మండలం నాగర్‌గూడ, దేవరాంపల్లి, వెంకటాపూర్‌ ఈసీ వాగు జలకళను సంతరించుకుంది. ఏపీజీవీబీ ఎదుట శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరి రాకపోకలకు ఆటంకం కలిగింది. లాలాపేట్‌కు లచ్చంపేట్‌ వాగు, ఇంకోవైపు చింతలపల్లి వాగు పొంగిపొర్లడంతో ఆ గ్రామానికి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.


వికారాబాద్‌ జిల్లా పరిగి బహార్‌పేట్‌ చౌరస్తాలో బిహార్‌ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు వరద నీటి ఉధృతికి మృతి చెందాడు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం కూడా వర్షాలు కొనసాగాయి. గుండాల మండలంలోని మల్లన్నవాగు, కిన్నెరసాని, నడివాగు, దున్నపోతులవాగు, ఏడుమెలికల వాగు, ఆళ్లపల్లి మండలంలో జల్లేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  వరంగల్‌ రూరల్‌లోని ఖానాపూర్‌లో 11 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 12, ములుగు జిల్లా కేంద్రంలో 10 సెంటీమీటర్లు, వరంగల్‌రూరల్‌లోని నర్సంపేటలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. 


జీహెచ్‌ఎంసీలో ఎల్లో వార్నింగ్‌  

హైదరాబాద్‌ అంతటా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒకటి రెండు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో వార్నింగ్‌ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవచ్చని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనంతో గురు, శుక్రవారాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ  వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 


ప్రాజెక్టులకు భారీగా వరద

ఆలమట్టి, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద ఉండటంతో ఆలమట్టి ప్రాజెక్టు కొన్నిగేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండడంతో ఐదు గేట్లను ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం ఒక్క రోజులో ఒక్క అడుగు పెరిగి 815.90 అడుగులుగా ఉంది.   కాగా, బుధవారం ఉదయం ఆలమట్టి డ్యాంలో 27,658 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదయింది. అయితే, 46,130 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి సుమారు 43 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. అలాగే దిగువకు 45,995 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు.  తుంగభద్ర ప్రాజెక్టుకు బుధవారం ఉదయం సుమారు 9,857 క్యూసెక్కుల వ రద నమోదయింది. 


Updated Date - 2020-07-16T13:19:47+05:30 IST