తెలంగాణ పోలీసులు గ్రేట్‌

ABN , First Publish Date - 2020-02-21T09:08:56+05:30 IST

‘తెలంగాణ పోలీసులు గ్రేట్‌’ అని ప్రముఖ సినీ నటి సాయిపల్లవి అన్నారు. గురువారం ఆమె హైటెక్‌ సిటీలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కాన్‌క్లేవ్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ పోలీసులు గ్రేట్‌

ఉమెన్‌ కాన్‌క్లేవ్‌లో నటి సాయిపల్లవి

స్త్రీ, పురుషుల్లో ఎవరూ తక్కువ కాదు: టెస్సీ థామస్‌

మహిళా భద్రతకే మా మొదటి ప్రాధాన్యం

ఐటీ కారిడార్‌లో 24 గంటలూ గస్తీ బృందాలు: సజ్జనార్‌ 


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ పోలీసులు గ్రేట్‌’ అని ప్రముఖ సినీ నటి సాయిపల్లవి అన్నారు. గురువారం ఆమె హైటెక్‌ సిటీలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కాన్‌క్లేవ్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు. మహిళల భద్రత, రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘స్త్రీ, పురుషుల్లో ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. ఇంటా.. బయటా ఇద్దరూ సమానమే’’ అని ఆమె అన్నారు. మహిళల భద్రత కోసం సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్సీఎస్సీ) ప్రత్యేకంగా రూపొందించిన ‘షీ సేఫ్‌’ యాప్‌ను ఆమె ఈ సందర్భంగా ప్రారంభించారు. మహిళలు తమలోని సృజనాత్మకతను బయటకు తీస్తే అద్భుతాలు సాధించవచ్చని దర్శకుడు రాజమౌళి అన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కూడా పాల్గొన్నారు. తాము మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని, కమిషనరేట్‌ పరిధిలో షీటీమ్‌ల సంఖ్యను 4 నుంచి 11కు పెంచామని చెప్పారు. ఐటీ కారిడార్‌లో 24 గంటలూ గస్తీ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక మహిళా ఫోరం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సజ్జనార్‌ తెలిపారు. మహిళలు క్యాబ్‌ల్లో అభద్రతా భావానికి గురవకుండా ‘మై క్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కాన్‌క్లేవ్‌లో రష్మిక మందన్న, తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఐజీ స్వాతి లక్రా, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సహా సుమారు 1200 మంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-21T09:08:56+05:30 IST