NITI Aayog : ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో టాప్-3లో తెలంగాణా

ABN , First Publish Date - 2022-07-21T20:25:06+05:30 IST

నీతీ ఆయోగ్ (NITI Aayog) ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌,

NITI Aayog : ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో టాప్-3లో తెలంగాణా

న్యూఢిల్లీ : నీతీ ఆయోగ్ (NITI Aayog) ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌, 2021లో ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణా, హర్యానా వరుసగా మొదటి మూడు స్థానాల్లో, ఆంధ్ర ప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత రాష్ట్రాల్లో మణిపూర్ (Manipur) అగ్ర స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్స్ కేటగిరీలో చండీగఢ్ టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ (Suman Bery) ఈ నివేదికను గురువారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీతీ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరమేశ్వరన్ అయ్యర్ (Parameswaran Iyer) పాల్గొన్నారు. 


గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్  (Global Innovation Index) తరహాలో ఈ సూచీని రూపొందించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 17 ప్రధాన రాష్ట్రాలు, 10 ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్స్‌గా విభజించారు. ఈ సూచీలో వరుసగా మూడో సంవత్సరం కర్ణాటక ప్రథమ స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్ ఈ సూచీలో ప్రధాన రాష్ట్రాల్లో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో చండీగఢ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాల్లో మణిపూర్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 


నీతీ ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ద్వారా భారత దేశంలో ఇన్నోవేషన్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు నీతీ ఆయోగ్ నిరంతరం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాలు, సంబంధిత ఇతర వర్గాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ (నూతన ఆవిష్కరణల సృష్టికి అవకాశం కల్పించే వాతావరణం)ను అభివృద్ధిపరచేందుకు తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. 


నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ మాట్లాడుతూ, సుస్థిర, సమ్మిళిత వృద్ధికి నూతన ఆవిష్కరణలు చాలా ముఖ్యమని చెప్పారు. మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్ళను పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణల వల్ల వీలవుతుందన్నారు. లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడతారన్నారు. జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తాయన్నారు. వీటన్నిటి వల్ల స్వయం సమృద్ధ భారత్‌కు బాటలు పడతాయన్నారు. 


2019 అక్టోబరులో మొదటి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను విడుదల చేశారు. 2021 జనవరిలో రెండో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను విడుదల చేశారు. 


Updated Date - 2022-07-21T20:25:06+05:30 IST