ఒక్క వానకే మునక!

ABN , First Publish Date - 2022-05-05T08:52:44+05:30 IST

ఒక్క వానకే మునక!

ఒక్క వానకే మునక!

వర్షంతో బయటపడ్డ యాదాద్రి పనుల డొల్లతనం

ప్రధానాలయ ముఖమండపం జలమయం

దర్శన క్యూకాంప్లెక్స్‌, ప్రసాద విక్రయశాలలోకీ నీళ్లు

ఈదురు గాలులకు కూలిన చలువ పందిళ్లు

వర్షపు నీటితో కుంగిపోయిన రెండోఘాట్‌ రోడ్‌

విరిగిపడ్డ చెట్లు.. కొండచరియలు, రహదారుల కోత

కొండపైన బస్‌బే.. కింద బస్టాండ్‌ బురదమయం

వరద నీటితో జలాశయాన్ని తలపించిన రింగురోడ్డు

డ్రైనేజీ  వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకుండా పునర్నిర్మాణ

పనులను చేపట్టడమే ఈ స్థితికి కారణమని విమర్శలు

 

యాదగిరిగుట్ట, మే 4: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా రూ.1280 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల డొల్లతనం ఒక్కవానకే బయటపడింది! బుధవారం వేకువజామున ఈదురు గాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది. లక్ష్మీనరసింహస్వామి కొలువైన గర్భాలయం మినహా.. కొండపైన, కొండకింద ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానాలయ ముఖమండపంలోనికి, దర్శన క్యూకాంప్లెక్స్‌, ప్రసాద విక్రయశాలలోకి వరద నీరు చేరింది. రెండో ఘాట్‌రోడ్‌కు అనుసంధానంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ ఘాట్‌రోడ్డు కుంగిపోయింది. కొండపైన ఆలయ పరిసర ప్రాంతాల్లో నాటిన కొబ్బరి చెట్లు నెలకొరిగాయి. కొండచరియల ప్రాంతాలు, రహదారులు కోతకు గురయ్యాయి. కొండపైన బస్‌బే, కొండకింద తాత్కాలిక బస్టాండ్‌ ప్రాంతాలు వరద నీటితో బురదమయంగా మారాయి. ప్రధానాలయానికి ఉత్తర దిశలోని లోహపు విద్యుత్‌ స్తంభం విరిగిపడింది. విద్యుత్తు సరఫరాకు సైతం పలుమార్లు అంతరాయం ఏర్పడింది. కొండకింద రింగురోడ్డు రహదారులు వరద నీటితో పూర్తిగా జలమయంగా మారి కుంటలను తలపించాయి. ముఖ్యంగా.. కొండపైన నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచింది. ప్రధానాలయం, అష్టభుజి ప్రాకార మండపాల్లోకి చేరిన నీటిని ఆలయ సిబ్బంది తొలగించాల్సి వచ్చింది. ప్రసాద విక్రయశాలలోకి వర్షపు నీరు రావడంతో భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వరద నీటిలో వెళ్లలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రసాదాల తయారీ భవనంపై వరద నీరు నిండిపోయి ట్యాంకును తలపించగా, విష్ణుపుష్కరిణిలోకీ వరద నీరు చేరింది. ఎండవేడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు కొండపైన విష్ణుపుష్కరిణి నుంచి శివాలయం వరకూ నిర్మించిన చలువ పందిళ్లు ఈదురుగాలుల తాకిడికి నేలమట్టమయ్యాయి. విష్ణుపుష్కరిణి పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసి నీటి కుళాయిలు నేలకూలాయి. కొండపైన బస్‌బే బురదమయంగా మారడంతో భక్తులు నడవడానికి ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కొండపైకి వెళ్లే ప్రయత్నం చేసిన బస్సులు ఆలయ మొదటి ఘాట్‌రోడ్‌ వద్ద బురద నీటిలో కూరుకుపోయాయి. దీంతో భక్తులు, స్థానికులు, పోలీసుల సాయంతో ఆ బస్సులను బయటకు తీయాల్సి వచ్చింది. కొండకింద ప్రెసిడెన్షియల్‌ సూట్‌ రింగు సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ ప్రాంతంలోని చలువ పందిరి వర్షం తాకిడికి కూలిపోయింది. ఆ ప్రాంతమంతా బురదతో నిండిపోవడంతో బస్సులు నిలిపేందుకు కూడా వీలుకాలేదు. ఆ సమయంలో ఆర్టీసీ అధికారులు కొండపైకి బస్సుల్ని నడపకపోవడంతో.. భక్తులు ఘాట్‌రోడ్‌ మీదుగా నానా అవస్థలు పడుతూ నడస్తూ కొండపైకి వెళ్లారు.


సరైన ప్రణాళిక లేకనే..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనుల నిర్వహణ ఆది నుంచి విమర్శలకు తావిస్తూనే ఉంది. ఆలయ నిర్మాణ ప్రణాళికలు, నమూనా డిజైన్లలో లోపాలే ఈ పరిస్థితికి కారణమనే వాదన వినిపిస్తోంది. నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం, ఆ పనులను కూడా నాసిరకంగా చేయడం వల్లనే కొండపైన, కింద వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు, స్థానికులు వాపోతున్నారు. ఒక్క పెద్ద వానకే కొండంతా అస్తవ్యస్తంగా మారడానికి కారణం కాంట్రాక్టర్లు, అధికారుల బాధ్యతారాహిత్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు వానాకాలంలో కురిసే భారీ వర్షాలకు గుట్ట స్వరూపం ఏవిధంగా మారిపోతుందోనని సామాన్య భక్తులు ఆందోళన చెందుతున్నారు.


ఒరిగిన సుదర్శన చక్రం?

ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ప్రధానాలయం విమాన గోపురంపైన ఉన్న సుదర్శన చక్రం ఒకవైపు ఒరిగినట్టు కనిపించిందని భక్తులు, స్థానికులు చెబుతున్నారు. ఇలా ఒరగడం అరిష్టానికి సూచన అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more