ప్రకృతిలో ఫైవ్‌ స్టార్‌ విడిది

ABN , First Publish Date - 2022-08-20T14:19:15+05:30 IST

ప్రకృతిలో ఫైవ్‌ స్టార్‌ విడిది

ప్రకృతిలో ఫైవ్‌ స్టార్‌ విడిది

సంగారెడ్డి అభయారణ్యంలో గ్లాంపింగ్‌

వీకెండ్‌ విడిది కేంద్రంగా రూపకల్పన

బొంతపల్లి అర్బన్‌ ఫారెస్టు బ్లాక్‌లో..


హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): కొడైకెనాల్‌ లాంటి ప్రాంతాల్లో ఉండే గ్లాంపింగ్‌ విడిది హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. ప్రకృతివనంలో ఫైవ్‌స్టార్‌ వసతి కల్పించి నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పని ఒత్తిడితో సతమతమయ్యే టెకీలు రిలాక్స్‌ కోసం వీకెండ్‌ వస్తే దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంటే వీకెండ్‌ విడిది కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. నగర శివారులోని 16 ఫారెస్టు బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్న హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు విభాగం మాత్రం సంగారెడ్డి జిల్లాలోని బొంతపల్లిలోని అభయారణ్యాన్ని ప్రకృతి ప్రేమికులకు విడిది చేసేందుకు వీలుగా రూపకల్పన చేస్తోంది.


సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పరిధి బొంతపల్లి, జిన్నారం, మంగపేట్‌, నాగవరం, పాలం, రాయపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ పరిధిలో 4,341  ఎకరాలు ఉన్నాయి. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. మియావాకి పద్ధతిలో చిట్టడవిని తలపించే విధంగా తీర్చిదిద్దే పనులను వేగవంతం చేశారు. బొంతపల్లి అర్బన్‌ ఫారెస్టు బ్లాక్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు దుండిగల్‌ ఇంటర్‌ఛేంజ్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ పార్కును హెచ్‌ఎండీఏ రూ.1.92 కోట్లతో అభివృద్ధి చేసింది.


పీపీపీ పద్ధతిలో ఏర్పాటు

అర్బన్‌ ఫారెస్టు బ్లాక్‌ పరిధిలోని గుట్టల ప్రాంతాన్ని 25 ఎకరాల మేర ఎంచుకొని గాంప్లింగ్‌ సైట్స్‌ ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. ప్రకృతి ప్రేమికులు సేద తీరేందుకు వీలుగా రూపకల్పన చేస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య, కొండలు, కోనల మధ్య గ్లాంపింగ్‌ సైట్‌ ఏర్పాటు చేస్తే టెంట్‌లో నుంచి సందర్శకులు కనుచూపు మేరలో అడవిని చూసేందుకు అవకాశముంటుంది.  తెలుగు రాష్ట్రాల్లో గ్లాంపింగ్‌ సైట్‌ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. మంత్రి కేటీఆర్‌, ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు ఇక్కడ గ్లాంపింగ్‌ సైట్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎండా, వాన, గాలి దుమారం వచ్చినా ఇబ్బందులు లేకుండా అధునాతనమైన గ్లాంపింగ్‌ టెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో ఉండే విధంగా అన్ని సదుపాయాలూ ఉండనున్నాయి. పార్కింగ్‌ సౌకర్యంతో పాటు ఫుడ్‌, బెడ్‌ సౌకర్యాలు ఉండనున్నాయి. టెకీలు, ఉద్యోగులు వీకెండ్‌ విడిది కేంద్రంగా ఉండేందుకు రూపకల్పన చేస్తున్నారు. పూర్తిగా ప్రైవేటు, పబ్లిక్‌ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-20T14:19:15+05:30 IST