నేడు మునుగోడు అభ్యర్థిపై మథనం

ABN , First Publish Date - 2022-08-10T12:27:36+05:30 IST

నేడు మునుగోడు అభ్యర్థిపై మథనం

నేడు మునుగోడు అభ్యర్థిపై మథనం

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఖరారు విషయంలోనూ అంతే వేగంగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకోసం బుధవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.  మధుయాష్కీగౌడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ, ఏఐసీసీ ఇన్‌చార్జులు బోసురాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా, మునుగోడు టికెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పున్న కైలాష్‌, పల్లె రవికుమార్‌తోపాటు చిలుముల కృష్ణారెడ్డిలకూ ఈ సమావేశానికి హాజరు కావాలంటూ గాంధీభవన్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇదిలా ఉండగా.. తానే అభ్యర్థినని, సహకరించి ఓటేసి, గెలిపించాలంటూ చిలుముల కృష్ణారెడ్డి మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి 11 గంటల వరకు తిరిగి ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మిగిలిన ఆశావహులు ముగ్గురూ కృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


పీసీసీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే అభ్యర్థినంటూ ఎలా ప్రచారం చేసుకుంటారని వారు ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 21న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. 2లక్షల మందితో చౌటుప్పల్‌లో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు స్రవంతి, కైలాష్‌, పల్లె రవి గ్రామగ్రామాన తిరుగుతున్నారు. అయితే కార్యకర్తల నుంచి వారికి విస్తుపోయే ప్రశ్నలు ఎదురైనట్లు తెలిసింది. ‘‘బీజేపీ కండువా కప్పుకొంటే సర్పంచ్‌కు రూ.20 లక్షలు ఇస్తామంటూ అవతలి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. 21వ తేదీలోపు మీరు కూడా ఏదో ఒకటి తేల్చండి’’ అంటూ సొంత పార్టీ నాయకులే అంటున్నట్లు సమాచారం. అయితే డిమాండ్‌ చేస్తున్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాము పదో, పరకో డబ్బు అందజేశామని, అదీ కాకపోతే మద్యం ఖర్చులు భరించామని, ఆ విశ్వాసం కూడా లేకుండా 21వ తేదీలోపు తేల్చండని చెబుతుంటే ఎన్నికను తలచుకుంటేనే భయమేస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘టీఆర్‌ఎస్‌ నుంచి మొదట్లో బీజేపీకి అధిక సంఖ్యలో చేరికలు ఉంటాయి. భారీ ప్యాకేజీలు ముట్టిన తర్వాత తీరా ఎన్నికల ముందు తిరిగి అధికార పార్టీ గూటికి చేరతారు. లేదంటే వాళ్ల చెక్‌పవర్‌ రద్దు, పోలీసు కేసుల భయాలు ఉంటాయి. ఆ ధీమాతోనే టీఆర్‌ఎస్‌ చెందిన ప్రజాప్రతినిధులే వారిని ముందుగా బీజేపీ వైపు వెళ్లేందుకు సహకరిస్తున్నారు. రకరకాల ఎత్తుగడలు కొనసాగతున్నాయి’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆశావహుడు ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.

Updated Date - 2022-08-10T12:27:36+05:30 IST