డబ్బులిస్తాం..చోరీ చెయ్‌..!

ABN , First Publish Date - 2022-08-09T13:59:32+05:30 IST

డబ్బులిస్తాం..చోరీ చెయ్‌..!

డబ్బులిస్తాం..చోరీ చెయ్‌..!

దొంగలతో బంగారం రిసీవర్ల ఒప్పందాలు

సొత్తు రికవరీ ఇవ్వాలని నిబంధన

జైలుకెళ్తే బెయిల్‌ బాధ్యత వారిదే..

కొత్త ముఠాలకు శిక్షణ ఇస్తున్న సీనియర్లు


హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): దొంగలు జట్టు కట్టి.. రెక్కీ నిర్వహించి చోరీలు చేయడం తెలిసిందే. చోరీలు చేసి ఆ సొత్తు తమకు ఇవ్వాలన్న నిబంధనతో అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చి మరీ చోరీలకు పంపుతున్న వైనం ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు విచారిస్తున్న క్రమంలో వెల్లడైంది. ఇటీవల మియాపూర్‌ పరిధిలో కర్ణాటకకు చెందిన చైన్‌ స్నాచర్‌ల ముఠాను పట్టుకోవాలని ప్రయత్నించిన హెడ్‌ కానిస్టేబుల్‌ను ఓ దొంగ కత్తితో గాయపరిచాడు. ఆ దొంగల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు వెంటాడి, వేటాడి పట్టుకున్నారు. వారిని విచారించగా, ఆ ముఠా వెనుక రిసీవర్లు (చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేసేవారు) ఉన్నట్లు తేలింది.


ముందే డబ్బిచ్చి..

కర్ణాటక దొంగల ముఠాను కొంత మంది రిసీవర్లు చోరీలు చేయడానికి నియమించుకున్నట్లు తెలిసింది. ముందుగా ఒప్పందం చేసుకుని చోరీ చేసేందుకు వీరిని పురమాయించినట్లు సమాచారం. ‘ఫలానా నగరంలో బంగారం దుకాణాల్లో సొత్తును దోచేయాలి.. ఆ సొత్తును మాకే తెచ్చి ఇవ్వాలి.. సొత్తును బట్టి డబ్బు’ ఇస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందు కోసం కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చి పంపుతున్నారు. అందులో భాగంగానే కర్ణాటకలోని గుల్బార్గాలో ఓ బంగారం దుకాణంలో చోరీ చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. రెండు సార్లు విఫలమయ్యారు. ఆ తర్వాత ఎలాగైనా చోరీ చేయాలని నిర్ణయించుకొని నగరానికి వచ్చినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. సైబరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో స్నాచింగ్‌లకు ప్రయత్నించిన ముఠా మియాపూర్‌లో స్నాచింగ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కింది. 


కొత్త ముఠాలు రంగంలోకి.. 

ఇటీవల పట్టుబడుతున్న దొంగల్లో ఎక్కువగా కొత్త కొత్త ముఠాలు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో చోరీలకు పాల్పడి కటకటాల్లోకి వెళ్లి వచ్చిన పాత చోరీలు చేయడం మానేసి, కొత్త ముఠాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. చోరీలు చేయాల్సిన విధానంపై వారికి సీనియర్లు శిక్షణ ఇస్తున్నారు. బంగారం, వెండి, ఇతర ఖరీదైన సొత్తును దోచేసిన తర్వాత.. దాన్ని తీసుకొని వారికి కావాల్సిన డబ్బు కమీషన్‌ రూపంలో చెల్లిస్తున్నారు. ఇలా కొత్త ఎత్తుగడలతో పాత ముఠాలు చోరీలు మానేసి.. కొత్త ముఠాలను రంగంలోకి దింపుతున్నారు. తమను తాము రక్షించుకోవడానికి కొత్త దొంగల ముఠాలు తుపాకులు వెంట తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఏయే రాష్ట్రాల్లో, ఏ నగరాల్లో చోరీలు చేయాలి, ఎవరి ఇళ్లను, దుకాణాలను కొల్లగొట్టాలి, పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చి మరీ పంపుతున్నట్లు సమాచారం.


పోలీసులకు దొరికితే..

చోరీ చేసిన సొత్తును అతి తక్కువ ధరకు కొంటున్న బంగారం రిసీవర్లు దొంగలు పోలీసులకు చిక్కి జైలు పాలైతే.. బెయిల్‌ ఇప్పించే బాధ్యతను వారే తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలోక పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసులకు చిక్కిన సమయంలో తాము ఎవరికోసం చోరీలు చేస్తున్నాము.. సొత్తును ఎక్కడ, ఎవరికి విక్రయిస్తాము అనేది నిందితులు చెప్పబోరు. అది ముందుగా బంగారం రిసీవర్లతో చేసుకున్న ఒప్పందం. ఇటీవల పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠాల్లో చాలా వరకు ఇలాంటివే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. 

Updated Date - 2022-08-09T13:59:32+05:30 IST