అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్‌ బిర్యానీ

ABN , First Publish Date - 2022-06-24T17:35:04+05:30 IST

అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్‌ బిర్యానీ

అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్‌ బిర్యానీ

చాదర్‌ఘాట్‌: నగరంలో  ఇంటి తాళాలను పగులగొట్టి విలువైన నగలు, నగదు దోచుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగను హైదరాబాద్‌ బిర్యానీ పట్టించింది. అదెలా అనుకుంటున్నారా.. మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో తూర్పు మండలం అదనపు డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి ఆ వివరాలను గురువారం వెల్లడించారు. మలక్‌పేట పరిధిలోని వెంకటాద్రినగర్‌ కాలనీలో నివాసముంటున్న కారు మెకానిక్‌ సయ్యద్‌ ఇఫ్తేకారుద్దీన్‌ మే 14న ఇంటికి తాళం వేసి నగరంలోని తన మామ ఇంటికి వెళ్లి వచ్చాడు. ఇంటి తాళాలు పగిలి ఉన్నట్లుగా గుర్తించి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన క్రైంపోలీసులు చోరీ జరిగిన ఇంటి సమీపంలో నమోదైన మొబైల్‌ కాల్‌ డేటాను సేకరించారు. మొబైల్‌ నంబర్‌పై కూపీ లాగి నిందితుడిని కర్ణాటకలోని మైసూర్‌ హలే కేసరేలో నివాసముంటున్న సయ్యద్‌ ఐజాజ్‌ ఎలియాస్‌ ఇమ్రాన్‌ (27)గా గుర్తించారు. నగరంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, తాళం పగులగొట్టి విలువైన నగలు, నగదును దోచుకొని పారిపోతాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే దోచుకున్న నగలు, నగదుతో తిరిగి వెళ్లే సమయంలో అతనికి ఇష్టమైన హైదరాబాద్‌ బిర్యానీని ఆరగించడం అలవాటు. పలు సందర్భాలలో మలక్‌పేట సోహైల్‌ హోటల్‌ నుంచి జొమాటో ద్వారా మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్‌కు బిర్యానీ తెప్పించుకుని, ఆ ట్రావెల్స్‌ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. వీటి లావాదేవీలు మొబైల్‌ నంబర్‌ ద్వారా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కాల్‌డేటా ఆధారంగా మలక్‌పేట క్రైం ఇన్‌స్పెక్టర్‌ నానునాయక్‌తో కూడిన క్రైం పోలీసుల బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్‌ ఐజాజ్‌ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా గుర్తించారు. మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్రైం ఇన్‌స్పెక్టర్‌ నానునాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-24T17:35:04+05:30 IST