తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు

ABN , First Publish Date - 2022-08-13T05:58:27+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ విభాగం), ఈసెట్‌లో అనకాపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తాచాటారు.

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు
వంటాకు రోహిత్‌, కురచా హేమంత్‌

అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో పొడుగుపాలేనికి చెందిన రోహిత్‌కు రెండో ర్యాంకు

ఈసెట్‌ (కెమికల్‌)లో అప్పలరాజుపురానికి చెందిన హేమంత్‌కు మొదటి ర్యాంకు


కె.కోటపాడు/ చీడికాడ, ఆగస్టు 12: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ విభాగం), ఈసెట్‌లో అనకాపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తాచాటారు. కె.కోటపాడు మండలం పొడుగుపాలెం గ్రామానికి చెందిన రోహిత్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో రెండో ర్యాంకు సాధించాడు. ఈసెట్‌లో చీడికాడ మండలం అప్పలరాజుపురానికి చెందిన కురచా హేమంత్‌ కెమికల్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. 


పొడుగుపాలెం విద్యార్థికి 2వ ర్యాంకు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌...అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో కె.కోటపాడు మండలం పొడుగుపాలెం గ్రామానికి చెందిన రోహిత్‌ రెండో ర్యాంకు సాధించి సత్తాచాటాడు. ఇతను పదో తరగతి వరకూ నర్సీపట్నం రవీంద్రభారతిలో, ఇంటర్మీడియట్‌ రాజమండ్రిలోని తిరుమల కళాశాలో చదువుకున్నాడు. ఈ సందర్భంగా  రోహిత్‌ మాట్లాడుతూ... వైద్య రంగంలో స్థిరపడాలన్నది తన లక్ష్యమన్నాడు. నీట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. కాగా రోహిత్‌ ఏపీ ఎంసెట్‌లో 88వ ర్యాంకు సాధించాడు. రోహిత్‌ తండ్రి గౌరినాయుడు 1998 డీఎస్‌సీలో ఎంపికైనా ఉద్యోగం రాకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరోవంక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి దేవుడమ్మ గృహిణి. 


ఈసెట్‌లో మెరిసిన హేమంత్‌

ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్ష (టీఎస్‌ ఈసెట్‌-22)లో చీడికాడ మండలం అప్పలరాజుపురానికి చెందిన కురచా హేమంత్‌ కెమికల్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. గ్రామంలో సామాన్య రైతు కుటుంబానికి చెందిన హేమంత్‌ ప్రాథమిక విద్యాభ్యాసం జైతవరంలో, హైస్కూల్‌ విద్య మంచాల మోడల్‌ స్కూల్‌లో సాగింది. అనంతరం విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డిప్లొమా చేశాడు. ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఏపీఈసెట్‌, టీఎస్‌ ఈసెట్‌ రాశాడు. తెలంగాణ ఈసెట్‌లో మొదటి ర్యాంకు సాధించిన హేమంత్‌...ఏపీ ఈసెట్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా హేమంత్‌ విలేఖరులతో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇంజనీరింగ్‌ అనంతరం ‘గేట్‌’ రాసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి ఉద్యోగం సాధించాలన్నది తన లక్ష్యమన్నాడు. హేమంత్‌ తండ్రి మోదినాయుడు రైతు కాగా, తల్లి భవానీ గృహిణి.


Updated Date - 2022-08-13T05:58:27+05:30 IST