కరోనాతో మరణించిన ప్రవాసీయుడికి ఒమాన్‌లో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-04-06T05:05:18+05:30 IST

ఒమాన్‌లో తెలంగాణకు చెందిన పడిగేల కృష్ణ అనే యువకుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు.

కరోనాతో మరణించిన ప్రవాసీయుడికి ఒమాన్‌లో అంత్యక్రియలు

గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి: ఒమాన్‌లో తెలంగాణకు చెందిన పడిగేల కృష్ణ అనే యువకుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. కరోనా నేపథ్యంలో కృష్ణ అంత్యక్రియలను ఒమాన్‌లోనే నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మారుపాక గ్రామానికి చెందిన పడిగేల కృష్ణ గత ఐదు సంవత్సరాలుగా ఒక క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తూ వచ్చాడు. వచ్చే నెలలో సెలవుపై భారత్ వెళ్లేందుకు అన్నీ సమకూర్చుకోగా.. ఇంతలో అతడి ఆరోగ్యం క్షీణించింది. కృష్ణను ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28న కృష్ణ తుదిశ్వాస విడిచాడు. 


కృష్ణ మృతదేహాన్ని భారత్ పంపడానికి వీలుకాకపోవడంతో అతడు పనిచేసిన కంపెనీ యజమాన్యం ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరును సంప్రదించారు. నరేంద్ర పన్నీరు వెంటనే స్పందించి తన బృందంతో కృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ అతడికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే కంపెనీతో మాట్లాడతామని నరేంద్ర తెలిపారు. ఆ డబ్బులు అతని కుటుంబానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ అంత్యక్రియల్లో ఉపాధ్యక్షులు మంచికట్ల కుమార్, కార్యదర్శి మామిడి శ్యాం, సభ్యులు పూదరి వెంకట్రాజులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-06T05:05:18+05:30 IST