Hyderabad: తెలంగాణ అభివృద్ధిని కేంద్రం ఓర్వలేకపోతోంది: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-07-17T00:15:31+05:30 IST

తెలంగాణ (Telangana) అభివృద్ధిని కేంద్రం ఓర్వలేకపోతోందని సీఎం కేసీఆర్‌ (CM KCR) మండిపడ్డారు.

Hyderabad: తెలంగాణ అభివృద్ధిని కేంద్రం ఓర్వలేకపోతోంది: కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ (Telangana) అభివృద్ధిని కేంద్రం ఓర్వలేకపోతోందని సీఎం కేసీఆర్‌ (CM KCR) మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం కక్షపూరిత విధానాలపై పార్లమెంట్‌లో గళమెత్తాలని ఆదేశించారు. కేవలం 8 రాష్ట్రాలే ఎక్కువ శాతం దేశ జీడీపీ (GDP)కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, అందులో తెలంగాణ ఒకటని తెలిపారు. తెలంగాణ నుంచి 8 ఏళ్లలో కేంద్రానికి వెళ్లింది ఎంత? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని?.. ఈ అంశాలపై లెక్కలు తేలాలని కేసీఆర్‌ డిమాండ్ చేశారు. ఎన్డీఏ (NDA) సర్కార్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరుకు సిద్ధమతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ (Telangana)కు నష్టం చేసే విధంగా కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై ఉభయ సభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. ఉపాధి హామీ పథకం అమల్లో ద్వంద్వ వైఖరిని నిలదీయాలని పేర్కొన్నారు. రూపాయి పతనంతోపాటు ఆర్థిక రంగంలో కేంద్రం అసంబద్ధ విధానాలపై పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్ సూచించారు.


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై కేసీఆర్‌ సమర శంఖం పూరించనున్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్రం వైఖరిని తేటతెల్లం చేయాలని నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక దమన నీతిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో శుక్రవారం ఫోన్లో మరోసారి కేసీఆర్‌ మంతనాలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ యాదవ్‌, ఇతర జాతీయ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు. కేంద్రంపై పోరుకు కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనలకు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు ప్రగతి భవన్‌ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-17T00:15:31+05:30 IST