తెలంగాణ జైఈఈ!

ABN , First Publish Date - 2022-08-09T09:50:23+05:30 IST

జేఈఈ-మెయిన్‌ రెండో విడత పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు.

తెలంగాణ జైఈఈ!

జేఈఈ మెయిన్‌-2లో ఐదుగురు విద్యార్థులకు 100 స్కోర్‌.. రాష్ట్ర టాపర్‌గా ధీరజ్‌ కూరుకుండ 

దేశవ్యాప్తంగా 24 మందికి 100 స్కోర్‌.. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 10 మంది


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జేఈఈ-మెయిన్‌ రెండో విడత పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ధీరజ్‌ కూరుకుండ, రూపేశ్‌ బియానీ, జాస్తి యశ్వంత్‌, బూస వెంకట ఆదిత్య, అనికేత్‌ ఛటోపాధ్యాయ 100 స్కోర్‌ సాధించారు. ధీరజ్‌ కూరుకుండ తెలంగాణ టాపర్‌గా నిలిచాడు. జేఈఈ-మెయిన్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది విద్యార్థులు 100 స్కోర్‌ సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెణికలపాటి రవి కిశోర్‌, పొలిశెట్టి కార్తికేయ, మెండ హిమవంశి, కొయ్యన సుహాస్‌, పల్లి జలజాక్షి ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన ఐదుగురి ఫలితాలను నిలిపివేశారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ నిర్వహిస్తారు. మెయిన్‌లో ర్యాంకు సాధించినవారిలో టాప్‌ 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హులవుతారు. ఇదిలా ఉండగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సోమవారం నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూలైలో జరిగిన జేఈఈ-మెయిన్‌ రెండో విడత పరీక్షకు 9,05,590 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలి సెషన్‌, రెండో సెషన్‌.. రెండూ రాసిన విద్యార్థులు 4.04 లక్షల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 662 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో.. కిందటేడాది నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు సార్లు నిర్వహించారు. జూన్‌లో జరిగిన జేఈఈ మెయిన్‌ తొలి విడతలో 14 మంది 100 స్కోర్‌ సాధించారు.


రాష్ట్రం నుంచి టాప్‌-5 వీరే..

ధీరజ్‌ కూరుకొండ

అనికేత్‌ ఛటోపాధ్యాయ

జాస్తి యశ్వంత్‌

రూపేశ్‌ బియానీ

బూస వెంకట ఆదిత్య

Updated Date - 2022-08-09T09:50:23+05:30 IST