తెలంగాణ దేశంలోనే అగ్రగామి

ABN , First Publish Date - 2022-08-12T05:55:45+05:30 IST

తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

తెలంగాణ దేశంలోనే అగ్రగామి
ర్యాలీలో జాతీయ జెండాతో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌

- మంత్రి  వీ శ్రీనివాస్‌గౌడ్‌  - స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలి

- సమాజంలో  అసమానతలు తొలగాలి

- మహనీయుల త్యాగాల ఫలితం ఈ నాటి భారతదేశ స్వాతంత్య్రం 

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 11 :  తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కామన్‌వెల్త్‌ క్రీడలలో దేశంలో రాష్ట్రం 2వ స్థానాన్ని పొందిందని తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో  సుమారు 5000 మంది ఉద్యోగులు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు తదితర వర్గాలతో చేపట్టిన ఫ్రీడం రన్‌ను ఆయన జిల్లా పరిషత్‌ మైదానం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ మైదానం నుంచి ప్రారంభమైన  ఫ్రీడమ్‌ రన్‌  బీఈడీ కళాశాల మైదానా నికి చేరుకున్నది. ఈ రన్‌లో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో పాల్గొని స్వతంత్ర వజ్రోత్సవ స్ఫూర్తిని చాటారు. అనంతరం బీఈడీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహనీయుల త్యాగల ఫలితమే ఈ నాటి స్వాతంత్రం అని, దీనిని ఆధారం చేసుకుని దేశం, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్థి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వాతంత్య్ర భారతంలో తెలంగాణ రాష్ట్రం  అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని అన్నారు. ముఖ్యంగా కామన్వ్‌ల్త్‌ క్రీడల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, కీడాశాఖ మంత్రిగా ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇంకా సమాజంలో కులమతాలు, అసమానతలు ఉన్నాయని, ఇవన్నీ అభివృద్ధికి నిరోధకాలుగా మారుతున్నాయని, మనుషులంతా ఒక్కటే అనే భావన ఉన్నప్పుడే దేశం ఐకమత్యంగా ఉండటమే కాకుండా, జాతీయ సమైక్యత సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో  కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు,  ఎస్పీ  వెంటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌, కె.సీతారామారావు, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న ముదిరాజ్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌, జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-12T05:55:45+05:30 IST