పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ

ABN , First Publish Date - 2022-08-20T10:23:26+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్ని రాయితీలు, ప్రోత్సాహకాలిస్తూ తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ప్రగతితో తెలంగాణ పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు.

పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ

టీఎస్‌ఐపాస్‌తో 20వేల పరిశ్రమలకు అనుమతులు.. మరే రాష్ట్రంలోనూ ఇవ్వలేనంతగా ప్రోత్సాహకాలు


డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రాంలో మంత్రి కేటీఆర్‌

50 దేశాల రాయబారులు, దౌత్యాధికారులు హాజరు

తెలంగాణ ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్‌ మస్కట్‌ ఆవిష్కరణ


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ/మారేడుపలి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్ని రాయితీలు, ప్రోత్సాహకాలిస్తూ తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ప్రగతితో తెలంగాణ పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. టీఎ్‌సఐపా్‌సతో సులభతర పారిశ్రామిక అనుమతులిస్తూ విప్లవం సృష్టించామని, ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, ఆహార శుద్ధి, ఏరో స్పేస్‌, రక్షణ రంగాల్లో దిగ్గజ పరిశ్రమలు కార్యాలయాలు నెలకొల్పేలా ఆకర్షించామని చెప్పుకొచ్చారు. శుక్రవారం టి హబ్‌లో ఏర్పాటు చేసిన ‘డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రాం’లో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. 50 దేశాల రాయబారులు, దౌత్యాధికారులు, డిప్యూటీ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఎ్‌సఐపా్‌సతో ఇప్పటివరకు 20వేలపైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. దీంతో ఐదేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగుల్లో తెలంగాణ అగ్ర స్థానంలో నిలుస్తోందని తెలిపారు. కేవలం ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రం.. ఆవిష్కరణ, మౌలిక వసతుల, సమ్మిళిత వృద్ధి ఆధారంగా ఇతర పెద్ద రాష్ట్రాల కంటే వేగంగా పురోగమిస్తోందని వివరించారు. ‘‘తెలంగాణ జీఎ్‌సడీపీ 2014లో రూ.5.06 లక్షల కోట్లుండగా ఈ ఏడాది మార్చిలో రూ.11.55 లక్షల కోట్లకు చేరింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1.49 లక్షలుంటే తెలంగాణలో రూ.2.08 లక్షలుగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. రాష్ట్రంలో 2014లో కేవలం 62.5 లక్షల ఎకరాలు సాగులో ఉండగా.. ఇప్పుడు 136 లక్షల ఎకరాలకు చేరాయి. ఐటీ ఎగుమతులు రూ.66 వేల కోట్ల నుంచి రూ.1.83 లక్షల కోట్లకు పెరిగాయి. 2014లో విద్యుదుత్పత్తి 9470 మె.వా. కాగా, ఇప్పుడు 17,280 మెగావాట్లు’’అని వెల్లడించారు.


ఆయిల్‌ పామ్‌తో ఎల్లో రెవల్యూషన్‌

వ్యవసాయంలో గ్రీన్‌, మత్స్య సంపద వృద్ధితో బ్లూ, పాల ఉత్పత్తితో వైట్‌, గొర్రెల పంపిణీతో మాంసంలో పింక్‌ రివల్యూషన్‌ సాధించామని కేటీఆర్‌ అన్నారు. ఆయిల్‌ పామ్‌లోనూ ముందుండాలన్న లక్ష్యంతో ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయనున్నామని, దీంతో ఎల్లో రివల్యూషన్‌ సాధించబోతున్నట్లు వివరించారు. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని, రెండు కొవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి ఇక్కడినుంచే ఉండడం హైదరాబాద్‌ ప్రాముఖ్యతతెలుపుతోందన్నారు. కార్యక్రమం అనంతరం తెలంగాణ ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్‌ (టీఐఏ) వర్చువల్‌ మస్కట్‌, ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ చాట్‌బోట్‌లను కేటీఆర్‌ ఆవిష్కరించారు.


సభ వెల వెల.. కేటీఆర్‌ గైర్హాజరు

 కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహావిష్కరణకు దూరం

అనుకున్నంత సంఖ్యలో ప్రజలు హాజరుకాకపోవడంతో సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ (జేబీఎస్‌) సమీపంలో.. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహావిష్కరణ సభకు మంత్రి కేటీఆర్‌ గైర్హాజరయ్యారు. కృష్ణస్వామి ముదిరాజ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సభకు ఏర్పాట్లు చేశారు. 10 వేల మందితో సభ ఉంటుందని ఆహ్వానాలు అందించే సమయంలో అతిథులకు చెప్పినట్టు తెలిసింది. జేబీఎస్‌ పక్కనున్న ఖాళీ స్థలంలో 3వేలపైగా కుర్చీలు వేశారు. విగ్రహావిష్కరణకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా వస్తారని ఆయన కార్యాలయ వర్గాలు సమాచారమిచ్చాయి. అయితే, సభ ప్రారంభ వేళకు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. నిర్వాహకులు పదేపదే విజ్ఞప్తి చేయడంతో 30శాతం కుర్చీలే నిండాయి. గంట, గంటన్నర పాటు టీ హబ్‌ ‘డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రాం’లో ఉండి సికింద్రాబాద్‌ రావాలని కేటీఆర్‌ భావించినా.. జేబీఎస్‌ వద్ద సభ వెలవెలపోతుందన్న విషయం తెలిసి అక్కడే చాలాసేపు ఉండిపోయారు. అయినా, జనం లేరని తెలిసి గైర్హాజరయ్యారు. ఇక, విగ్రహావిష్కరణకు అతిథులుగా హాజరైన మంత్రులు, మేయర్‌ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 

Updated Date - 2022-08-20T10:23:26+05:30 IST