గుజరాత్‌ కన్నా ముందంజలో తెలంగాణ

ABN , First Publish Date - 2022-07-05T10:48:40+05:30 IST

పారిశ్రామిక వృద్ధిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలే తమకు ప్రధాన పోటీదారులని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

గుజరాత్‌ కన్నా ముందంజలో తెలంగాణ

  • మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కన్నా కూడా..
  • రాష్ట్రంలో సులభతర పారిశ్రామిక విధానం అమలు
  • మేము నంబర్‌-1గా ఉన్నందునే ర్యాంకుల ఎత్తివేత
  • ఈ ఏడాది పరిశ్రమలకు రాయితీలు చెల్లిస్తాం: కేటీఆర్‌
  • 19 మంది పారిశ్రామికవేత్తలకు ఎఫ్‌టీసీసీఐ అవార్డులు
  • ‘ఏరో స్పేస్‌ డిఫెన్స్‌’లో అనంత్‌ టెక్నాలజీస్‌కు అవారు


హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక వృద్ధిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలే తమకు ప్రధాన పోటీదారులని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విదేశీ పరిశ్రమలు దేశంలో పెట్టుబడి పెట్టే ముందు అన్ని రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను పరిశీలిస్తాయని, ఈ నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే అన్ని అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. సులభతర వ్యాపారం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స)పై కేంద్రం ఏటా రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటిస్తుండగా, గత ఏడాది తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా తెలంగాణకు ప్రథమ స్థానం ఇవ్వాల్సి వస్తుందనే.. ర్యాంకింగుల విధానాన్నే ఎత్తేశారని ఆరోపించారు. పరిశ్రమల స్థాపనలో ఎక్కువ వృద్ధి సాధిస్తోన్న ఏడు రాష్ట్రాల్లో ఈసారి గుజరాత్‌ పేరునూ చేర్చడాన్ని బట్టి.. విషయమేంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వాణి జ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ప్రతిభ కనబర్చిన పారిశ్రామికవేత్తలకు 19 విభాగాల్లో ఎక్స్‌లెన్స్‌ అవార్డులను మంత్రి కేటీఆర్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను అవలంబిస్తోందన్నారు.


కేవలం సులభతర వ్యాపారానికే పరిమితం కాకుండా సంతోషకర వ్యాపారానికీ కావాల్సిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 15 రోజుల్లోనే అన్నిరకాల అనుమతులు అందించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన టీఎ్‌సఐపా్‌సతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. సరిపడా నీరు, విద్యుత్తు అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో వరి విస్తారంగా పండుతోందన్నారు. ధాన్యం ఉత్పత్తితో గ్రీన్‌ రెవల్యూషన్‌, పాల ఉత్పత్తితో వైట్‌ రెవెల్యూషన్‌ సాధించామని, మత్స్య సంపదతో బ్లూ రెవెల్యూషన్‌, గొర్రె మాంసంలో పింక్‌ రెవెల్యూషన్‌ సాధించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10వేల ఎకరాల్లో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని  కోరారు. కాగా, పరిశ్రమలకు ప్రభు త్వం అందించాల్సిన రాయితీలపై సమావేశం ప్రారంభంలో పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ అంశంపై కేటీఆర్‌ స్పందిస్తూ.. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు ఇవ్వలేకపోయామని, ఈ ఏడాది తప్పకుండా అందిస్తామని చెప్పారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు. 


అత్యుత్తమ పరిశ్రమలకు అవార్డులు.. 

వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన పరిశ్రమలకు ఎఫ్‌టీసీసీఐ రాష్ట్ర స్థాయి ఎక్స్‌లెన్స్‌ అవార్డులు అందించింది. యాదగిరిగుట్ట సమీపంలోని సురేంద్రపురి మ్యూజియానికి పర్యాటక అభివృద్ధిలో ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదానం చేశారు. మాజీ ఐఏఎస్‌ లక్ష్మీకాంతం, ప్రతిభ ఈ అవార్డు అందుకున్నారు. పారిశ్రామిక ఉత్పత్తిలో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో సామ్‌ అగ్రిటెక్‌, మార్కెటింగ్‌ ఇన్నెవేషన్‌లో బీఫ్యాక్‌ 4ఎక్స్‌, ఎగుమతుల్లో రవి ఫుడ్స్‌, సర్వోత్తమ్‌ కేర్‌ పరిశ్రమలు, ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌లో మెట్రోకెమ్‌ ఏపీఐ, సీఎ్‌సఆర్‌లో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌లో స్కైషేడ్‌ డేలైట్స్‌, కన్వర్జ్‌ బయోటెక్‌, హెల్త్‌కేర్‌లో క్లిక్‌ 2 క్లినిక్‌ హెల్త్‌కేర్‌, పరిశోధన అభివృద్ధిలో మైత్రీ డ్రగ్స్‌, సహస్ర క్రాప్‌ సైన్స్‌, ఏరోస్పేస్‌ డిఫెన్స్‌లో అనంత్‌ టెక్నాలజీస్‌, ఐటీలో వివిధ్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ అసోసియేషన్‌గా సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌, మహిళా సాధికారతలో నవభారత్‌ వెంచర్స్‌ అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా ఎన్‌చాంట్‌ కేఫే వ్యవస్థాపకురాలు దీపా దాదు, సైన్స్‌ ఇంజినీరింగ్‌లో ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీకి చెందిన సైంటిస్ట్‌ ఇబ్రమ్‌ గణేష్‌కు ఎక్స్‌లెన్స్‌ పురస్కారాలు అందజేశారు.

Updated Date - 2022-07-05T10:48:40+05:30 IST