‘ఉస్మానియా’ పై ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోయారా?

ABN , First Publish Date - 2021-02-26T19:26:37+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సంబంధించి సైట్‌ప్లాన్‌, గూగుల్‌ మ్యాప్‌లను

‘ఉస్మానియా’ పై ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోయారా?

  • కొత్తది కడతారా? పాతదాన్నే పునరుద్ధరిస్తారా?
  • నాలుగు వారాల్లోగా చెప్పండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సంబంధించి సైట్‌ప్లాన్‌, గూగుల్‌ మ్యాప్‌లను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చివేసి దానిస్థానంలో కొత్తది నిర్మిస్తారా? దాన్ని పునరుద్ధరిస్తారా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చెప్పాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. పాడుబడిన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుతూ హైకోర్టులో కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఉస్మానియా హెరిటేజ్‌ భవనమని, దాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం సరికాదని, మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని కోరుతూ మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.


ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. వీటిని పరిశీలించిన ధర్మాసనం 2015 నుంచి వరుసగా వ్యాజ్యాలు దాఖలైన అంశాన్ని గుర్తించింది. అప్పటి నుంచి ఈ భవనంపై ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. పంచవర్ష ప్రణాళిక సైతం ఐదేళ్లే ఉంటుందని, మీరు ఆరేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ భవనంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని నాలుగు వారాల్లోగా తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Updated Date - 2021-02-26T19:26:37+05:30 IST