తెలంగాణ ధాన్యాగారంగా కరీంనగర్‌

ABN , First Publish Date - 2020-04-04T10:44:05+05:30 IST

‘కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లాగా కరీంనగర్‌ జిల్లా రికార్డు స్థాయిలో వరి

తెలంగాణ ధాన్యాగారంగా కరీంనగర్‌

రబీలో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి

కొనుగోలు  కోసం 1,221 కేంద్రాల ఏర్పాటు

కాళేశ్వరం ప్రాజెక్టుతో అద్భుత ఫలితం 


కరీంనగర్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లాగా కరీంనగర్‌ జిల్లా రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. రబీలో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడితో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తెలంగాణ ధాన్యాగారంగా పేరు తెచ్చుకుంటున్నది’ అని రాష్ట్ర  బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిఽధిలో కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు మొత్తం స్థిరీకరణ జరిగిందన్నారు. కొత్త ఆయకట్టుకు కూడా నిరందించే అవకాశం కలిగిందని, చెరువులు కుంటలను ప్రాజక్టు నీటితో నింపి ఒక్క సెంటు భూమి కూడా ఖాళీగా ఉండకుండా చూడడంతో రైతులు అత్యధిక వరి దిగుబడి సాధించారన్నారు. వర్షాలు విస్తారంగా కురవడం కాళేశ్వరం ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ, మిడ్‌ మానేరు రిజర్వాయర్లు నిండుకుండల్లా మారడంతో జిల్లాలో రబీ సాగు విస్తారంగా సాగిందని చెప్పారు. ఈ సంవత్సరం రబీలో ఉమ్మడి జిల్లా పరిధిలో 7,92,576 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, ఈసారి 15,95,741 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని మంత్రి వివరించారు.


ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

ధాన్యం పెద్ద ఎత్తున మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రతి గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం, పెద్ద గ్రామమైతే రెండు కొనుగోలు కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1,221 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. గత సంవత్సరం రబీలో 3,72,842 ఎకరాల్లో వరి సాగు జరగగా 9,14,490 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. గత సంతవ్సరం 933 కొనుగోలు కేంద్రాలుండగా ఈసారి 300 కేంద్రాలను అదనంగా పెట్టాలని నిర్ణయించి 1,221 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరీంనగర్‌ జిల్లాలో 339, పెద్దపల్ల్లిలో 290, జగిత్యాల్లలో 380, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 212 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి ద్వారా వరి ధాన్యం కొంటామన్నారు. రబీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రతి రైతుకు మద్ధతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. 


అన్ని వసతులు ఏర్పాటు

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమికూడి ఉండకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిశుభ్రతను పాటించడంతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి విద్యుత్‌, నీటి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఒక వేళ వర్షాలు కురిసినా ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్‌లకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి వివరించారు. 

Updated Date - 2020-04-04T10:44:05+05:30 IST