Telangana Grameena Bank దోపిడీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

ABN , First Publish Date - 2022-07-06T20:51:39+05:30 IST

జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది.

Telangana Grameena Bank దోపిడీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

నిజామాబాద్: జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది. బ్యాంక్ దోపిడీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మహారాష్ట్ర (Maharashtra), ఉత్తరప్రదేశ్, గుజరాత్లకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి.బ్యాంక్ దోపిడికి పాల్పడ్డ దుండగులు ఉపయోగించిన వాహనం ఆచూకిని యూపీలోని ఇందల్వాయిలో గుర్తించారు. దొంగల ముఠా కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి చొరబడిన దొంగలు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గ్యాస్‌ కట్టర్‌ల సహాయంతో బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు లాకర్‌ను తెరచి తాకట్టుపెట్టిన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బంగారం విలువ సుమారు నాలుగున్నర కోట్లకు పైగా ఉండగా.. ఇతర లాకర్‌ల ధ్వంసానికి ప్రయత్నాలు చేసినా గ్యాస్‌ అయిపోవడంతో వదిలివెళ్లిపోయారు. 



ఖాతాదారుల్లో మూడు గ్రామాల ప్రజలు

బ్యాంకు పరిధిలో మూడు గ్రామాలకు చెందిన రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు తమ డబ్బులు డిపాజిట్‌ చేశారు. బంగారం కూడా కుదవపెట్టి రుణాలు తీసుకున్నారు. కొంతమంది ఈ బ్యాంకులో బంగారం లాకర్‌లో దాచుకున్నారు. బ్యాంకులో చోరీ ఘటన తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. ఊరుకి కొద్దిదూరంలో జాతీయ రహదారికి పక్కనేఉన్న ఈ బ్యాంకులో దొంగతనం జరగడంతో సోమవారం గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ (DOG squad) పిలిపించి వివరాలు సేకరించిన పోలీసులు ఇతర రాష్ట్రాల దొంగల గ్యాంగుల పనే అని గుర్తించారు.

Updated Date - 2022-07-06T20:51:39+05:30 IST