Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

గల్ఫ్ కార్మికుల శ్రేయస్సు పట్టదా?

twitter-iconwatsapp-iconfb-icon
గల్ఫ్ కార్మికుల శ్రేయస్సు పట్టదా?

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటన విజయవంతమైనట్లు చెప్పుకొచ్చారు. పెట్టుబడుల ఆకర్షణ, సర్కారు బడుల అభివృద్ధికి విరాళాల సేకరణ ప్రధాన ఎజెండాగా కేటీఆర్ పర్యటన సాగింది. వారం రోజుల పర్యటనలో రూ. 7,500 కోట్ల పెట్టుబడుల సేకరణకు హామీ పొందారట. ధనవంతులైన ఎన్నారైల నుండి పెట్టుబడులను ఆకర్షించడం, సొంత ఊరు బడి అభివృద్ధి పేరిట భావోద్వేగాలతో విరాళాలు సేకరించటంలో ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రభుత్వానికి ప్రవాసుల సంక్షేమం పట్ల లేదు. మిగతా దేశాల కంటే గల్ఫ్ దేశాల నుంచే విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా వస్తున్నదని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు సూచిస్తున్నాయి. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభపడుతున్నాయి. గల్ఫ్ ఎన్నారైలు నేరుగా డబ్బు విరాళంగా ఇవ్వలేకపోవచ్చు. కానీ వారి జీతంలో ఖర్చులకు పోను మిగిలిన మొత్తాన్ని భారత్‌కు విదేశీ మారకద్రవ్యం రూపంలో పంపిస్తున్నారు. అందువల్ల నిరుపేద గల్ఫ్ కార్మికులను నిర్లక్ష్యం చేయడం తగదు. 


తెలంగాణ ప్రభుత్వం కేరళ, పంజాబ్ తరహాలో ప్రవాసీ విధానం తెస్తామని చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడేండ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ‘ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ’ ఏర్పాటు చేసింది. ప్రతి దేశంలో కోఆర్డినేటర్సును నియమించి రాష్ట్రంతో ప్రవాసాంధ్రుల బంధాన్ని బలోపేతం చేసింది. రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాలో డా. రవి వేమూరును ఎన్నారై అఫైర్స్ చైర్మన్‌గా నియమించారు. జయరాం కోమటిని నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ మంత్రి హోదాలో నియమించారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ ఎన్నార్టీని కొనసాగిస్తున్నారు. వెంకట్ ఎస్ మేడపాటిని చైర్మన్‌గా కేబినెట్ మంత్రి హోదాతో నియమించారు. రత్నాకర్ ఆర్ పండుగాయలను నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా, హరిప్రసాద్ రెడ్డి లింగాలను నార్త్ అమెరికా నుంచి పెట్టుబడులకు ప్రధాన అనుసంధానకర్తగా, మాజీ ఎంపీ ఎం. జ్ఞానేంద్ర రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో నియమించారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురు అమెరికన్ ప్రవాసాంధ్రులకు కేబినెట్ మంత్రి హోదా కల్పించి వారి సేవలను వినియోగించుకున్నది. 


తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క అమెరికన్ తెలంగాణ ప్రవాసికీ సముచిత హోదా, గౌరవం ఇవ్వలేదు. ఇంతవరకు తెలంగాణలో ప్రవాసుల కోసం ఎన్నారై పాలసీని ప్రవేశపెట్టలేదు. ‘గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు’ను ఏర్పాటు చేయలేదు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఉగాది, మహిళా దినోత్సవం తదితర సందర్భాల్లో పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీ. ప్రవాస తెలంగాణీయులను ప్రభుత్వం విస్మరిస్తున్నది. మాతృభూమి అభివృద్ధికి ప్రవాసులు ఎంతో సహాయపడుతున్నారు. విదేశాలలోని వలస జీవులందరూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు. దసరా, బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలను విదేశాల్లో నిర్వహించి తెలంగాణ ఉద్యమ ఉధృతికి కృషి చేశారు.


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 23 నెలల తరువాత ఎన్నారై మంత్రిగా కె.తారక రామారావును 2016లో కేసీఆర్ నియమించారు. ఈ ప్రథమ ప్రవాసీ మంత్రి 27 జులై 2016న హైదరాబాద్‌లో ప్రవాసులతో ఎన్నారై పాలసీ సమావేశం నిర్వహించారు. టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక- 2014లో పేజీ నెం.22లో తెలంగాణ ప్రవాసుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, దేశంలోనే అత్యుత్తమ ప్రవాసీ విధానం ఏర్పాటు చేస్తామని ఆ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.

ప్రత్యేక ప్రవాస భారతీయుల విభాగం ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల భద్రత రక్షణ కోసం కృషి, ఎన్ఆర్ఐ పెట్టుబడులకు ప్రోత్సాహం అనేవి ఎన్నికల ప్రణాళికలో ప్రధానమైన హామీలు. పెట్టుబడుల సేకరణపై ఉన్న శ్రద్ధ, ఇతర హామీలను నెరవేర్చడంలో లేదు. ఏడున్నర ఏళ్ళు గడిచిపోయినా ఆ హామీలు అమలుకు నోచుకోలేదు. ఏడేళ్ళు అమెరికాలో నివసించిన అనుభవం, అత్యధిక గల్ఫ్ వలసలు కలిగిన సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌కు వలస కార్మికుల సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్నది. తలుచుకుంటే అద్భుతాలు చేయగలరు. కానీ, ఎందుకు పట్టించుకోవడం లేదనేది అంతుచిక్కని ప్రశ్న.


15 లక్షలమంది గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే ధోరణిని కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదు. గల్ఫ్‌లో ఉన్న కార్మికులు, గల్ఫ్ నుండి వాపస్ వచ్చి గ్రామాల్లో ఉన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కోటి మందికి ఓటు హక్కు ఉన్నది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓటమికి గల్ఫ్ ఓటు బ్యాంకు కూడా ఒక కారణం. సమగ్ర ప్రవాసీ విధానం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ కార్మికుల సంక్షేమం, పునరావాసానికి కృషి ఇత్యాది డిమాండ్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలోని 30 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన స్థితిలో గల్ఫ్ కార్మికులు ఉన్నారన్న వాస్తవాన్ని పాలకులు మరిచిపోకూడదు.

-మంద భీంరెడ్డి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.