చీకటిలో కీలక జీవోలు!

ABN , First Publish Date - 2021-07-25T09:03:50+05:30 IST

ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కీలకమైన జీవోలు. కానీ, ప్రభు త్వ వెబ్‌సైట్‌లో మాత్రం ఇవేవీ కనిపించలేదు. అతి ర హస్యంగా ‘డార్క్‌ జీవో’లుగా వెలువడ్డాయి. ఇవి మచ్చు కు కొన్ని మాత్రమే. ప్రతి ముఖ్యమైన, కీలకమైన జీవో ఇలాగే బయటకు వస్తోంది. కొన్ని జీవోలైతే వెలుగులోకే రావడంలేదు. కానీ, ఆ జీవోల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయి...

చీకటిలో కీలక జీవోలు!

  • ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ కాని ఉత్తర్వులు.. ప్రజలకు తెలియకుండానే విడుదల.. అమలు
  • భద్రతా కమిషన్‌, ఐఏఎ్‌సల బదిలీల జీవోలూ అంతే.. ప్రతి ఏటా సగం ఉత్తర్వులే వెబ్‌సైట్‌లోకి 
  • అప్రాధాన్య జీవోలు కుప్పలు తెప్పలుగా దర్శనం.. ప్రజల హక్కులకు భంగమంటున్న నిపుణులు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రాష్ట్ర భద్రతా కమిషన్‌’ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ మంత్రిని ఎక్స్‌ అఫీషియో చైర్మన్‌గా, డీజీపీని ఎక్స్‌ అఫీషియో సెక్రటరీగా, మరో ముగ్గురిని సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు సంబంధించి రాష్ట్ర హోంశాఖ ఈ నెల 7న జీవో ఆర్‌టీ నెంబర్‌ 1094ను జారీ చేసింది. 


ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కన్నన్‌ను కరీంనగర్‌ కలెక్టర్‌గా, మహబూబాబాద్‌ కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ను ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ చేస్తూ, మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌కు అదే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నెల 19న జీవో ఎంఎస్‌ నెంబర్‌ 1604ను జారీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ద్వారా ఈ జీవో జారీ అయింది. 


కొత్తగా ఏర్పాటు చేసే లే-అవుట్లలో ప్లాట్‌ విస్తీర్ణం కనీసం 60 గజాలు ఉంటే సరిపోతుందని, లే-అవుట్‌ అప్రోచ్‌ రోడ్డు 50 అడుగుల వెడల్పు ఉండాలని, లే-అవుట్‌లో కనీసం 15 శాతం భూమిని తనఖా పెట్టాలన్న నిబంధనలతో ఈ నెల 7న జీవో ఎంఎస్‌ నెంబర్‌ 105 విడుదలైంది. పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ ఈ జీవోను జారీ చేసింది. పంచాయతీరాజ్‌ శాఖలో 9300 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.28 వేలకు పెంచుతూ పంచాయతీరాజ్‌ శాఖ ఈ నెల 15న జీవో ఎంఎస్‌ నెంబర్‌ 26ను జారీ చేసింది. 


హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కీలకమైన జీవోలు. కానీ, ప్రభు త్వ వెబ్‌సైట్‌లో మాత్రం ఇవేవీ కనిపించలేదు. అతి ర హస్యంగా ‘డార్క్‌ జీవో’లుగా వెలువడ్డాయి. ఇవి మచ్చు కు కొన్ని మాత్రమే. ప్రతి ముఖ్యమైన, కీలకమైన జీవో ఇలాగే బయటకు వస్తోంది. కొన్ని జీవోలైతే వెలుగులోకే రావడంలేదు. కానీ, ఆ జీవోల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తే తప్ప.. వాటిని బయట పెట్టరు. వాస్తవానికి ప్రభుత్వ ఆలోచనల ప్రకారం ఇవి నిర్దేశిత తేదీల్లోనే తయారవుతుంటాయి. కానీ, బయటి ప్రపంచానికి మాత్రం రెండు మూడు రోజుల తర్వాత తెలుస్తాయి. అది కూడా ఏదో వాట్సాప్‌ గ్రూపులోనో, అధికార వర్గాల ద్వారానో వెలుగు చూస్తుంటాయి. జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఉండదు.


సగమే ప్రజల ముందుకు

ప్రభుత్వంలోని 32 శాఖలకు సంబంధించి ప్రతి ఏటా సగటు న 6000 నుంచి 8000 వరకు జీ వోలు వెలువడుతుంటాయి. కా నీ, వీటిలో సగం మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అవుతున్నాయి. మిగతా సగం జీవోలు వెబ్‌సైట్‌ లో కనిపించడంలేదు. ఇలా.. 2014 జూన్‌ 2 నుంచి 2019 ఆ గస్టు 15 వరకు1,04,171 జీవోలు వెలువడ్డాయి. వీటిలో 43,462 జీవోలను వెబ్‌సైట్‌లో పొందుపరచలేదంటూ బీజేపీ నాయకుడు పేరాల చం ద్రశేఖర్‌ ఇటీవల కోర్టు దృష్టికి తెచ్చారు. 2020 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు 4207 జీవోలు, ఈ ఏ డాది జనవరి 1 నుంచి ఈ నెల 23 వరకు 2646 జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. కానీ, చాలా ము ఖ్యమైన జీవోలు మాత్రం వెబ్‌సైట్‌లోకి రాలేదు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో గత ఏడాదిన్నర కాలం లో వేలాది జీవోలు జారీ కాగా.. వెబ్‌సైట్‌లో పదుల సంఖ్యలోనే దర్శనమిచ్చాయి. అయితే అప్రాధాన్య అం శాలకు సంబంధించిన జీవోలను మాత్రం ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. ఉద్యోగుల మెడికల్‌ రీ-యింబర్స్‌మెంట్‌, అద్దె వాహనాలు, టెలిఫోన్‌ బిల్లుల చెల్లింపు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విధుల కొనసాగింపు, కార్మిక శాఖ నేతృత్వంలో ఆర్టీసీ యాజమాన్యానికి, కండక్టర్లు, డ్రైవర్ల మధ్య వివాదాల పరిష్కారం, పరిశ్రమల్లోని కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన జీవోలను మాత్రం అప్‌లోడ్‌ చేస్తుంటారు. 


ప్రజల హక్కులను హరించడమే: నిపుణులు

ప్రభుత్వ జీవోలను బహిరంగపరచకుండా దాచిపెట్టడమనేది ప్రజల హక్కులను హరించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని చెబుతున్నా రు. లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ)ను ఉ ల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు.. 2005లో తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టంలోని చాప్టర్‌ 2, సెక్షన్‌ 2, 4 నిబంధనల ప్రకారం ప్రతి అంశాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, ప్రభుత్వం విధిగా సమాచారాన్ని బహిరంగపరచాలని చెబుతున్నారు.


ఉద్దేశపూర్వకంగానే దాపరికం!

ప్రభుత్వ పాలనలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదని, పారదర్శకతను పాటించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ గెజిట్‌ ఆర్డర్‌లను పబ్లిక్‌ డొమెయిన్‌(ప్రజలకు అందుబాటులోకి) చేస్తాయి. దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించి, ప్రతి శాఖలోని జీవోను ఇందులో అప్‌లోడ్‌ చేస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా తన జీవోల కోసం http://goir.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో 32 శాఖలకు సంబంధించిన జీవోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరు, ముఖ్యమైన నియామకాలు, పదోన్నతులు, పదవీ విరమణలు, వివిధ కమిషన్ల ఏర్పాటు, ఐఏఎ్‌సలు, ఇతర అధికారుల బదిలీలు, పదవీ బాధ్యతల అప్పగింత, వివిధ రకాల అనుమతులు.. వంటి అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవోలు వెలువడుతుంటాయి. కానీ, ఇందులో చాలా ముఖ్యమైన జీవోలను మాత్రం ప్రభుత్వం అప్‌లోడ్‌ చేయడంలేదు. ప్రభుత్వ విధానాలకు, పద్ధతులకు ఏదైనా ఇబ్బంది వస్తుందనుకునే జీవోలను పొందుపరచడం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జీవోలను దాచిపెడుతుందన్న ఆరోపణలున్నాయి. 

Updated Date - 2021-07-25T09:03:50+05:30 IST