Open Heart With RK కార్యక్రమంతో తెలుగు ప్రజలకు మరింత చేరువైన ABN ఆంధ్రజ్యోతి ఈ వారం కూడా ఒక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మీ ముందుకు రాబోతోంది. Open Heart With RK Season-3లో ఈ వారం అతిథి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ తెలంగాణ గవర్నర్‌తో చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఈ ఇంటర్వ్యూ ఆసాంతం ఎలా సాగిందో ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. డాక్టర్ అయిన మీరు పాలిటిక్స్‌లోకి ఎలా వచ్చారని RK అడగ్గా.. చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉందని తమిళిసై బదులిచ్చారు. మీ భర్త కూడా డాక్టరే కదా అని రాధాకృష్ణ చెప్పగా.. మంచి డాక్టర్ అని తెలంగాణ గవర్నర్ ఆమె భర్తకు కితాబిచ్చారు.
‘తమిళనాడుకు చెందిన మిమ్మల్ని తెలంగాణకు పంపించారంటే కచ్చితంగా ఏదో ఒక మిషన్‌లో భాగంగా పంపించి ఉంటారు కదా’ అని ఆర్కే అడగ్గా.. తెలంగాణ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని తానని.. ఎలాంటి మిషన్‌లో భాగంగా తనను తెలంగాణకు పంపించలేదని తమిళసై చెప్పారు. తాను పదేపదే చెబుతున్నానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని.. తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేసేందుకు తెలంగాణకు రాలేదని ఆమె తెలిపారు. కానీ.. బీజేపీ వ్యక్తిగా తనను వాళ్లు చూస్తున్నారని టీఆర్‌ఎస్‌పై ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
‘రిపబ్లిక్ డే’ సమయంలో కేవలం Flag Hoistingకే తనను పరిమితం చేశారని, మాట్లాడనివ్వకుండా చేశారని తమిళిసై చెప్పారు. తన తల్లి చనిపోయిన సందర్భంలో కేసీఆర్‌కు తాను కాల్ చేసి చెప్పానని, ఆ సందర్భంలో కూడా ఆయన రాలేదని ఆమె తెలిపారు. గతంలో గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తితో కేసీఆర్ ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని, తాను మహిళను కావడం వల్ల తనతో ఇలా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహాన్ని తమిళసై వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌గా మిమ్మల్ని గుర్తించేందుకు సుముఖంగా లేదని.. కేంద్ర ప్రభుత్వాన్ని మిమ్మల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని అడుగుతారా అని తమిళసైని ఆర్కే అడిగారు. తాను ఎందుకు అలా అడుగుతానని.. ‘I Love Telangana’ అని ఆమె వ్యాఖ్యానించారు. తమిళిసై అనే వ్యక్తిగా తనను అవమానించినా, తనపై రాళ్లేసినా, ఆ గాయం కారణంగా బయటకొచ్చిన రక్తంతో కలాన్ని నింపి ఆ సిరాతో చరిత్ర రాస్తానని.. ‘దటీజ్ తమిళసై’ అని ఆమె భావోద్వేగంతో చెప్పారు.