నోరు మంచిదైతే...

ABN , First Publish Date - 2020-11-21T05:38:33+05:30 IST

గోదాచిన్నది, కుస్తీ పెద్దది! మొన్న దుబ్బాక ఉప ఎన్నికలోనూ అదే అనిపించింది, ఇప్పుడు జిహెచ్ఎంసి సమయంలోనూ అదే అనిపిస్తోంది. ఇరవైనలుగురు ఎమ్మెల్యేలు కొలువుతీరినప్పటికీ బల్దియా గోదా, దుబ్బాక కంటె చాలా పెద్దదే.......

నోరు మంచిదైతే...

గోదాచిన్నది, కుస్తీ పెద్దది! మొన్న దుబ్బాక ఉప ఎన్నికలోనూ అదే అనిపించింది, ఇప్పుడు జిహెచ్ఎంసి సమయంలోనూ అదే అనిపిస్తోంది. ఇరవైనలుగురు ఎమ్మెల్యేలు కొలువుతీరినప్పటికీ బల్దియా గోదా, దుబ్బాక కంటె చాలా పెద్దదే అయినప్పటికీ, తెలంగాణతో, భారతదేశంతో పోలిస్తే చిన్నదే. కానీ, హడావిడి మాత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నంత మారుమోగిపోతున్నది. అంతర్జాతీయ ఉగ్రవాదం దగ్గర నుంచి విదేశాంగ వ్యవహారాల దాకా అన్నీ చర్చలోకి వస్తున్నాయి. వాదోపవాదాల హోరు ఆకాశాన్ని అంటుతుంటే, బుద్ధులు అందుకు తగ్గట్టుగా గొప్పగా, ఉన్నతంగా ఉన్నాయా అంటే లేదు. అక్కడ మాత్రం ఎప్పటి వలెనే, కంచుమోగునట్లు కనకంబు మోగునా అనిపిస్తున్నది. 


గాంభీర్యం, హుందాతనం వంటి వాటికి రాజకీయాలలో విలువ బొత్తిగా లేకుండా పోయింది. జిహెచ్ఎంసి ఎన్నికల తేదీని అకస్మాత్తుగా ప్రకటించడం, ప్రత్యర్థులకు వ్యవధి లేకుండా గాభరా పెట్టడం... వ్యూహరచనా నైపుణ్యం కావచ్చును కానీ, ధర్మయుద్ధం మాత్రం కాదు. ఎన్నికల ప్రకటనకు ముందు ఉదారంగా పన్ను రాయితీలు, అనేక వరాలు ప్రకటించడం, షెడ్యూలు విడుదల అయిన రోజున కూడా పదివేల వరదసాయం పంపిణీ చేయడం– కోర్టులో కొట్టుకుపోయేవి కావేమో కానీ, నైతికంగా పొరపాట్లే కదా? ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి వరదసాయం నిలిపివేయవలసి వస్తే, అందుకు నువ్వే కారణమని దబాయించడం మరొక విచిత్రం. 


నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలోని ప్రాంతీయ పార్టీ సరళి ఇట్లా ఉంటే, ఏడు దశాబ్దాల నుంచి ఏదో ఒక రూపంలో ఉనికిలో ఉంటూ, ఆరేళ్ల నుంచి దేశాన్నే ఏలుతున్న జాతీయపార్టీ సరళి అందుకు భిన్నంగా ఏమీ లేదు. పైగా నాలుగాకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తున్నది. వరదసాయం పాతికవేలు ఇస్తామని, కొట్టుకుపోయిన కార్లు, స్కూటర్లు కూడా ఇస్తామని భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు అనర్గళంగా వాగ్దానాలు గుప్పించారు. అంతేకాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసులు విధించే చలానాలను కూడా జిహెచ్ఎంసి చేత కట్టిస్తామని చెప్పి సామాజిక మాధ్యమాలలో నవ్వుల పాలయ్యారు. బిహార్ ఎన్నికలలో తేజస్వి యాదవ్ పదిలక్షల ఉద్యోగాలను వాగ్దానం చేశారు. ఆ సంఖ్యే అతిశయం, అసాధ్యం. అతనెక్కడ గెలుస్తాడోనని, బిజెపి-జెడియు పదమూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. హైదరాబాద్ లో కూడా బిజెపి ధోరణి అట్లాగే ఉన్నది. టిఆర్ఎస్ ఇచ్చేదాని కంటే ఇబ్బడి ముబ్బడిగా ఇస్తామని చెప్పి, ప్రచారంలో పైచేయి సాధించడమే లక్ష్యంగా ఉన్నది. అసలే, జిహెచ్ఎంసికు ఆదాయవనరులు లేవు. కొద్దొగొప్పో ఆదాయం ఇచ్చే ఆస్తిపన్నుకే ఎన్నికల వాగ్దానాలు కోతపెడితే ఎట్లా? 


భారతీయ జనతాపార్టీ ప్రజానీకంలో విభజన తెచ్చే పద్ధతిలో వ్యవహరిస్తుందని, మతపరమైన ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తుందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో విమర్శిస్తూనే ఉన్నాయి. ఆ పార్టీ సైద్ధాంతిక విషయాలే కాక, కేంద్రంలో పాలనా విధానాలు కూడా అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఒక పార్టీ సిద్ధాంతాలను, అభిప్రాయాలను, విధానాలను ఆమోదించడం లేదా విభేదించడం ఇతర పార్టీల హక్కు కూడా. కానీ, జాతీయ విధానాలను, అంతర్జాతీయ విధానాలను, ఆయా సందర్భాలలో విమర్శించకుండా, స్థానిక సంస్థల ఎన్నికలలో చర్చకు పెట్టడం ఏమిటి? విదేశాంగ విధానం బాగా లేకపోతే, సరిహద్దులలో ఉద్రిక్తతలకు ప్రభుత్వ విధానాలే కారణమైతే, దేశహితం రీత్యా వెంటనే స్పందించడం సబబు కానీ, కీలకమయిన సమయాలలో మౌనంగా ఉండి, నగరపాలక ఎన్నికలలో ప్రచారాంశంగా తీసుకురావడం ఏమి సబబు? బిజెపి ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వివాదాస్పద చట్టాలకు మద్దతు ఇస్తూ, విధేయంగా ఉండాలనుకునే ప్రాంతీయ పార్టీ, ప్రభుత్వం ఇప్పుడు భిన్నంగా మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది? 


ఇక బిజెపి రాష్ట్ర నాయకుల సరళి గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. విజయాలతో ప్రజలు వారిని ఆదరిస్తున్నా, అందుకు తగ్గ పరిపక్వత వారికి సమకూరడం లేదు. ఎంత స్థాయికి ఎదిగినా, వారు ఎప్పుడూ మజ్లిస్‌తో పోటీనే తమ స్థాయి అని తృప్తిపడతారు. ఎవరో నాయకుడు అననే అన్నారు, తమకు మజ్లిస్‌తోనే పోటీ అని. ఒక మతవర్గానికే పరిమితంగా పనిచేసే మజ్లిస్ వ్యవహార సరళిలో ఇప్పటికీ అనేక అభ్యంతరకర అంశాలు ఉండవచ్చు, వారు మరింత ఆమోదనీయతను సాధించడానికి ప్రయత్నం చేయడం అవసరమూ కావచ్చును. కానీ, ఆ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, చట్టబద్ధంగా ఉనికిలో ఉన్న పార్టీ. ఆ పార్టీని ఉగ్రవాద పార్టీ అని నిందించడం విభజనను తీవ్రం చేయడమే. బిజెపి మజ్లిస్ అంశాన్ని ప్రస్తావించగానే, మజ్లిస్‌తో తమకు మైత్రి లేదు అని టిఆర్ఎస్ చెప్పడం ఏమి నీతి? వారిద్దరి సఖ్యత అందరికీ తెలిసిందే. దాన్ని సమర్థించుకోవాలి కానీ, మిత్రపార్టీ నిజంగానే ఉగ్రవాద సంస్థ అన్నట్టుగా వెంటనే విదిలించుకోవడం, ఏమి స్నేహధర్మం? అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ బిజెపికి లోపాయకారీగా సహకరిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే, బిజెపి కూడా ఉగ్రవాదంతో అంటకాగుతున్నదని ఇతరులు భావించాలా? మజ్లిస్ పైనే మనసు లగ్నం చేయడం వల్లనే బిజెపి రాష్ర్టనేతలు ముఖ్యమంత్రిని కూడా ఉగ్రవాది అని నిందించే సాహసం చేశారు.


ఎంత ఎన్నికల వేళ అయినా, విచక్షణ లేకుండా మాట్లాడడం రాజకీయనేతలకు మంచిది కాదు. కెసిఆర్ కూడా బిజెపిని తీవ్రంగా దూషించిన మాట నిజమే, కానీ, ఆయన బిజెపి అగ్రనేతలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదు. అభివృద్ధి అంశాలను చర్చలోకి తెచ్చి, సత్పరిపాలన కోసం పాటుబడతామని ఓటర్ల ముందుకు రావాలి కానీ, మతపరమైన విభజన మీద ఆధారపడి రాజకీయం చేద్దామనుకుంటే, హైదరాబాద్ సమాజం అందుకు సమ్మతించదు. హైదరాబాద్ అభివృద్ధికి, సుస్థిరతకు, శాంతియుత సహజీవనానికి సంబంధం ఉన్నది. దానిని భంగపరచకుండా, మరేదైనా సభ్య అంశాన్ని ఎంచుకుని పోరాడితే ఫలితం ఉండవచ్చు. పెద్దరికం చూపితే ప్రజల విశ్వాసం పెరుగుతుంది!


చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉండే ఎన్నికలు కాబట్టి, కాసింత సంస్కారంగా, సున్నితంగా, గంభీరంగా రాజకీయ పోరాటం చేయవలసిందిగా అన్ని పక్షాలను ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-11-21T05:38:33+05:30 IST