వన్య మృగాల దాడిలో మనిషి చనిపోతే...

ABN , First Publish Date - 2021-04-06T00:06:55+05:30 IST

వన్య మృగాల దాడిలో మనిషి చనిపోతే...

వన్య మృగాల దాడిలో మనిషి చనిపోతే...

హైదరాబాద్: వన్య మృగాల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారం పెంచాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఐదు లక్షలు ఇస్తూ ఉండగా మొత్తాన్ని ఏడున్నర లక్షలకు పెంచాలని సూచించింది. పంట నష్టం, పశు సంపద నష్టానికి పరిహారం పెంచాలని పేర్కొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇస్తున్న పరిహారాలను తెలంగాణ అటవీ అధికారులు అధ్యయనం చేశారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న మానవ, జంతు సంఘర్షణ నివారణ కమిటీకి ప్రతిపాదనలను అందించారు. త్వరలోనే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. పెద్ద పులి, చిరుత, ఎలుగుబంటి, అడవి పంది వంటి వన్య ప్రాణులతో పాములు, కోతుల కారణంగాను మనుషులు కోల్పోతున్నారు. కొందరు శాశ్వతంగా అంగవైకల్యానికి గురవుతున్నారు. అడవి పందు, జింకలు, కోతుల కారణంగా రైతులకు పంట నష్టం వాటిల్లుతోంది. పులులు పశువులను చంపి తింటున్నాయి.


ఇలాంటి ఘటనలతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ జంతు సంఘర్షణ నివారణతో పాటు నష్ట పరిహారాల పెంపుపైనా ప్రత్యేక కమిటీ దృష్టి పెట్టింది. నష్ట పరిహారంపై ప్రతిపాదనలు సమర్పించింది. వన్య ప్రాణుల దాడుల్లో మనిషి చనిపోతే మహారాష్ట్రలో రూ. 15 లక్షల పరిహారం ఇస్తున్నారు. దేశంలో అత్యధిక పరిహారం అక్కడే ఇస్తున్నారు. తెలంగాణలో ఐదు లక్షలు ఉండగా ఏడున్నర లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. 30 రోజుల్లోగా క్లెయిమ్‌ను పరిష్కరించాలని బాధిత కుటుంబానికి ఇచ్చే పరిహారంలో 50 శాతం మొత్తాన్ని బ్యాంకు, పోస్టాఫీసుల్లో దీర్ఘకాల డిపాజిట్ రూపంలో ఉండాలని పేర్కొంది. 

Updated Date - 2021-04-06T00:06:55+05:30 IST