Abn logo
May 22 2020 @ 18:01PM

చక్రి సోదరుడి సారథ్యంలో కరోనా పాట.. ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య  కార్మికులు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలను కొనియాడుతూ ప్రముఖ గేయ రచయిత బాలాజీ రాసిన పాటకు చక్రి  సోదరుడు మహిత్ నారాయణ్ చక్కని సంగీతం అందించారు. ప్రముఖ గాయనీగాయకులు మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయి చరణ్, నిహాల్, గీతామాధురి, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, విలేజ్ సింగర్ బేబీ పాడిన ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిత్ మిత్రులు ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘10 మంది గాయనీ గాయకులు పాట పాడిన తీరు, బాలాజీ గారి రచన, మహిత్ నారాయణ్‌గారి సంగీతం చాలా  బాగా కుదిరాయి. పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ పాట రాయడం చాలా గొప్ప విషయం. ఈపాట మరింత స్పూర్తినిచ్చేలా ఉంది. ఈ పాట కోసం పని చేసిన టీమ్ మెంబెర్స్‌ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.


సంగీత దర్శకులు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు చేసే సేవలకు ప్రతిఒక్కరూ చేతులెత్తి మొక్కాలి. వారి గురుంచి పాట చేయడం.. ఆ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిగారు లాంచ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. నా మిత్రుల సహకారంతో ఈ పాటను చేయగలిగాను. పాటను స్వరపరిచిన అలాగే నాకు సహకరించిన గాయనీ గాయకులకు.. మిత్రులు ప్రభాకర్, రాజుకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement