Oct 23 2021 @ 19:32PM

‘తెలంగాణ దేవుడు’కి రిలీజ్ డేట్ ఫిక్సయింది

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ ఉద్యమనాయకుడి పాత్రలో నటించిన ఈ చిత్రంతో జిషాన్ ఉస్మాన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది నవంబర్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించి.. విడుదల తేదీని ప్రకటించారు.


ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది. ముందు ఈ పాత్రలో అనగానే భయపడ్డాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 12న సినిమా విడుదలవుతుంది..’’ అని తెలుపగా దర్శకుడు హరీష్‌ వడత్యా మాట్లాడుతూ.. ‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారికి, చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. నవంబర్ 12న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నాం..’’ అని తెలిపారు.

చిత్ర నిర్మాత మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్‌గా రూపుదిద్దుకున్న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది ఓ మహనీయుని చరిత్ర. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఒక నిఘంటువు. అటువంటి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమనాయకుని చరిత్ర అందరికీ తెలియాలనే.. ఈ చిత్రం చేశాము. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.