ఢిల్లీకి చేరిన టీ కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-04-04T09:57:42+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. సోమవారం ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ముఖ్య నాయకులతో...

ఢిల్లీకి చేరిన టీ కాంగ్రెస్‌

  • నేడు రాహుల్‌తో ముఖ్యనేతల భేటీ
  • 38మంది నేతలకు అందిన ఆహ్వానం
  • రేవంత్‌పై ఫిర్యాదుకు సీనియర్ల సమాయత్తం 
  • కౌంటర్‌కు రెడీ అవుతున్న రేవంత్‌ వర్గం
  • కుటుంబ సమేతంగా ఢిల్లీకి జగ్గారెడ్డి 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. సోమవారం ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ముఖ్య నాయకులతో రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఒక్కో రాష్ట్రం నుంచీ ముఖ్యనేతలను పిలిపించుకుని రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారు. ఏకతాటిపై పార్టీని నడిపే అంశంపైన, పార్టీ బలోపేతంపైనా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ నేతలు లేవనెత్తుతున్న సమస్యలను ఆలకించి తగు ఆదేశాలూ ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో సోమవారం రాహుల్‌గాంధీ సమావేశం అవుతున్నారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులందరినీ, పార్టీ సీనియర్‌ నేతలు, ముఖ్యనాయకులు కలుపుకొని మొత్తం 38 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. అయితే టీపీసీసీలో ఇటీవలి కాలంలో ముదిరిన అంతర్గత కలహాలు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకునే వరకూ వెళ్లాయి. రేవంత్‌రెడ్డి పార్టీని నడిపిస్తున్న తీరును తప్పు పడుతూ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్ఠానానికి ఘాటు లేఖ రాయగా... పార్టీ సీనియర్‌ నేతలు సమావేశం నిర్వహించుకోవడం, మంత్రి హరీశ్‌రావును మాజీ ఎంపీ వీహెచ్‌ కలవడంపైన రేవంత్‌ వర్గం ఫిర్యాదు చేసింది. రేవంత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అధిష్ఠానానికి ప్రత్యక్షంగా వనిపించేందుకు ఆయన వ్యతిరేక వర్గం అవకాశం కోసం చూస్తుండగా.. పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలకు మోకాలొడ్డుతున్నారంటూ వాదన వినిపించేందుకు రేవంత్‌ వర్గం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌తో సోమవారంనాటి సమావేశం ఆసక్తికరంగా మారింది. రేవంత్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి, వీహెచ్‌, మర్రి శశిధర్‌రెడ్డి తదితర నేతలకూ ఆహ్వానాలు అందడం చర్చనీయాంశంగా మారింది. కాగా, సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. తన వాదన వినిపించేందుకు సోనియా, రాహుల్‌ల అపాయింట్‌మెంట్‌ను కోరిన జగ్గారెడ్డి.. కుటుంబ సమేతంగా రైలులో ఆదివారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పీపుల్స్‌ మార్చ్‌ పేరిట సొంత నియోజకవర్గం మధిరలో పాదయాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టివిక్రమార్క.. తన పాదయాత్రకు విరామం ఇచ్చి ఢిల్లీకి వెళ్లారు. 


అపాయింట్‌మెంట్‌ మిస్‌! 

కొద్ది రోజులుగా సోనియా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్న వీహెచ్‌కు ఆమె ఆపాయింట్‌మెంట్‌ దొరికినట్టే దొరికి చేజారిపోయింది. మార్చి 31న సాయంత్రం 5 గంటలకు ఆమె అపాయింట్‌మెంట్‌ ఇవ్వగా.. ఆ సమాచారం వీహెచ్‌కు అదేరోజు మధ్యాహం అందింది. ఆయన ఢిల్లీకి వెళ్లలేక పోయారు. రాహుల్‌తో సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన వీహెచ్‌.. సోనియా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.


Updated Date - 2022-04-04T09:57:42+05:30 IST