టీ.కాంగ్రెస్ ‘ఛలో రాజ్ భవన్’ రచ్చరచ్చ.. ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి..

ABN , First Publish Date - 2022-06-16T19:31:07+05:30 IST

రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు..

టీ.కాంగ్రెస్ ‘ఛలో రాజ్ భవన్’ రచ్చరచ్చ.. ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి..

హైదరాబాద్: రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో రేణుకను మహిళా పోలీసులు చుట్టుముట్టారు. మహిళా పోలీసులతో రేణుక వాగ్వాదానికి దిగి.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొడతానని ఎస్.ఐకి రేణుక వార్నింగ్ ఇచ్చింది. ఎస్.ఐ కాలర్ పట్టుకుని రేణుక ప్రశ్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేణుకా చౌదరి హెచ్చరించారు.


డీసీపీ జోయల్ డేవిస్ కాలర్‌ను మరో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పట్టుకోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. చివరకు రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఛలో రాజ్‌భవన్‌’లో భాగంగా ఖైరతాబాద్ వద్దకు యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. చౌరస్తాలో బైక్‌కు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బస్సుల రాకపోకలను అడ్డుకుని కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆర్టీసి బస్సు ఎక్కి యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి దిగి అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్ రెడ్డిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.



ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని గోశామహల్ పోలీసు స్టేషన్‌కు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులను పంజాగుట్ట పోలీసు స్టేషన్లకు తరలించారు. బారికేడ్లు అడ్డుపెట్టి కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు నిలువరించారు. బారికేడ్లు తోసుకుని రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో.. ఆందోళనకు దిగిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


తెల్లవారు జామున ఐదున్నర గంటల నుంచి రాజ్‌భవన్ ముట్టడి యత్నాలు మొదలయ్యాయి. ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు పెట్టనున్నారు. ప్రస్తుతం రాజ్ భవన్ వద్ద సాధారణ పరిస్థితులు ఉన్నాయి. రాజ్ భవన్ ముందు రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలను అరెస్ట్ చేయడంతో రాజ్ భవన్ వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2022-06-16T19:31:07+05:30 IST