Target Modi: మొదటి శత్రువుపై ముప్పేట దాడి

ABN , First Publish Date - 2022-08-20T03:19:13+05:30 IST

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన తనయుడు కె. తారకరామారావు, కుమార్తె కవిత ముప్పేట దాడి చేస్తున్నారు.

Target Modi: మొదటి శత్రువుపై ముప్పేట దాడి

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన తనయుడు కె. తారకరామారావు, కుమార్తె కవిత ముప్పేట దాడి చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవలే దాడిని ఉధృతం చేశారు. కేసీఆర్ బహిరంగసభల్లో మోదీపై విమర్శలు గుప్పిస్తుంటే కేటీఆర్, కవిత సామాజిక మాధ్యమాల వేదికగా మోదీని, బీజేపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. మోదీ తెలంగాణాకు ఇచ్చిందేమీ లేదంటూ గణాంకాలు చూపిస్తూ కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. మోదీ ఇచ్చింది చాలా స్వల్పమని విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న వికారాబాద్‌లో తెలంగాణకు మోదీయే మొదటి శత్రువుని కేసీఆర్ ప్రకటించేశారు. గతంలో కేసీఆర్ రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలు చేసినా ఇటీవల మోదీని మొదటి శత్రువని ప్రకటించడం ద్వారా కలకలం రేపారు. తెలంగాణకు ప్రధాన శత్రువు నరేంద్ర మోదీయేనని, దుర్మార్గుడైన మోదీని దేశం నుంచి తరిమికొట్టి అద్భుత భారతదేశాన్ని సృష్టించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కల్లబొల్లి కథలు తప్ప మోదీ చెప్పిన ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదన్నారు. మోదీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ప్రధాని ఎర్రకోట ప్రసంగంపై ఎంతో ఆశ పెట్టుకున్నానని, వేషాలు, డైలాగులు తప్ప అందులో ఒక పథకం లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశ పరిస్థితి దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని, రూపాయి విలువ పడిపోతోందన్నారు. గతంలో ఏనాడూ లేని పరిస్థితులు మోదీ హయాంలో వస్తున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.






ఇక ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కూడా మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సోషల్ మీడియాలో మోదీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. బిల్కిస్‌ బానో కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ర్తీలను గౌరవించాలని ఆగస్టు 15న ఎర్రకోట నుంచి దేశానికి నిర్దేశించిన ప్రధాని... తన మాటల్లోని నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఇదే అన్నారు. గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి, ఖైదీలను తిరిగి జైలుకు పంపడం ద్వారా ప్రధాని తన చిత్తశుద్ధి, నిబద్దతను దేశానికి చాటాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 




స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ధి ప్రధాని నరేంద్ర మోదీకి లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఎర్రకోట నుంచి చేసిన మోదీ ప్రసంగంంలో 2047 నాటికి సాధించాల్సిన కొత్త లక్ష్యాలు.. వినడానికి ఎంతో బాగున్నాయని ఓ ట్వీట్‌లో కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్న సంగతిని మోదీ ఇప్పటికైనా గుర్తించాలన్నారు. 2022 నాటికి దేశ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014లో చేసిన వాగ్దానం, 2022 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్‌ కల్పిస్తానని 2014లో ఇచ్చిన హామీ, 2022 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్‌ డాలర్లుగా మారుస్తానని 2018లో చేసిన వాగ్దానం, 2022 నాటికి ప్రతి భారతీయుడికి సొంత ఇల్లు కట్టిస్తానని 2018లో ఇచ్చిన హామీ.. ఇలా ఏ ఒక్క వాగ్దానాన్ని మోదీ నెరవేర్చలేదని కేటీఆర్‌ విమర్శించారు. లక్ష్య సాధనలో ఎదురైన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా కొత్త వాటి గురించి చెబితే విశ్వసనీయత ఏముంటుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. 


ఎమ్మెల్సీ కవిత కూడా ప్రధాని మోదీపై, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటని, 75 ఏళ్ల స్వాతంత్రంలో పేదరికం అంతకంతకూ పెరుగుతోందని మోదీ పాలనపై ధ్వజమెత్తారు. మతతత్వాన్ని సమూలంగా ఈ దేశం నుంచి రూపుమాపాలంటూ బీజేపీని, మోదీని టార్గెట్ చేశారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్, కేటీఆర్, కవిత... మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేరుగా మోదీనే టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం ద్వారా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

Updated Date - 2022-08-20T03:19:13+05:30 IST