బీజేపీ, టీఆర్‌ఎస్‌ రచ్చ

ABN , First Publish Date - 2020-07-13T08:39:25+05:30 IST

ప్రశాంతంగా ఉన్న వరంగల్‌ నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఉన్నట్టుండి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హంటర్‌ రోడ్‌లోని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంపై ఒక్కసారిగా

బీజేపీ, టీఆర్‌ఎస్‌ రచ్చ

  • బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ దాడి.. 
  • దాస్యం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి బీజేపీ యత్నం
  • అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడికి టీఆర్‌ఎస్‌ యత్నం.. వరంగల్‌లో ఉద్రిక్తత
  • నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలతో మొదలైన రగడ
  • చంచల్‌గూడ జైల్లో 25 కోట్లతో ప్రత్యేక గదులు నిర్మించుకుంటున్నారు
  • కేసీఆర్‌ కుటుంబానికి జైలే.. హిందూ వ్యతిరేక శక్తుల చేతుల్లో రాష్ట్రం 
  • కేంద్ర నిధులతో చేసిన పనులకు కేంద్ర మంత్రిని పిలవరా?: అర్వింద్‌
  • కేంద్రంలో బీజేపీ ఉందని మరవొద్దు: ఆ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌
  • కేసీఆర్‌ కుటుంబంపై వ్యాఖ్యలు సిగ్గుచేటు: చీఫ్‌ విప్‌ దాస్యం, నన్నపునేని

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: ప్రశాంతంగా ఉన్న వరంగల్‌ నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఉన్నట్టుండి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హంటర్‌ రోడ్‌లోని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి దిగారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీదకు దూసుకువచ్చారు. అప్రమత్తమైన పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడితో అవాక్కయిన బీజేపీ శ్రేణులు కొద్ది సేపటి తర్వాత వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ క్యాంప్‌ కార్యాలయం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశాయి. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అడ్వకేట్స్‌ కాలనీ మీదుగా క్యాంప్‌ ఆఫీస్‌ వైపు వెళుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలతో ఆదివారం వరంగల్‌ నగరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌.. సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఘటనలు జరిగాయి.


 ‘‘తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోంది. 2023 తర్వాత కేసీఆర్‌ కుటుంబం అడ్రస్‌ ఫామ్‌ హౌస్‌, ప్రగతి భవన్‌ కాదు.. చంచల్‌గూడ జైలే.. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, సంతోశ్‌ల కోసం జైల్లో రూ.25 కోట్లతో ప్రత్యేక ఏసీ గదులు నిర్మించుకుంటున్నారు’’ అని బీజేపీ నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేక శక్తుల్లో పెట్టిన దగుల్బాజీ హిందూ, దొంగ హిందూ కేసీఆర్‌ అని మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌ మహ్మద్‌ అలీ జిన్నా లాంటి వాడు. అసదుద్దీన్‌ ఒవైసీని తన పెద్ద కొడుకులా చూసుకుంటూ ఆయన అడుగు జాడల్లో రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. హిందువుల రక్షణ కోసం ప్రధాని మోదీ తెచ్చిన సీఏఏను వ్యతిరేకించి తన హిందుత్వ డొల్లతనాన్ని తెలియజేసుకున్నాడు. ప్రజల పుణ్యాన గద్దెనెక్కి ఫామ్‌ హౌస్‌లు, ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులు సంపాదించాడు. ఎన్నికల హామీలను మరచిన కేసీఆర్‌ పార్టీని ప్రజలు బొంద పెడతారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన కేసీఆర్‌, ప్రజల ప్రాణాలను గాలికి వదిలి ఫామ్‌ హౌస్‌కు పరిమితం అవుతున్నాడు. దేశవ్యాప్తంగా సగటున 7.3 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయితే, రాష్ట్రంలో 21 శాతం కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం నిధులతో జరిగిన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రిని ఆహ్వానించకుండా తానే ప్రారంభిస్తానని ఆరాటపడుతున్న కేటీఆర్‌కు సిగ్గు, శరం ఉండాలి. స్మార్ట్‌ సిటీ కోసం కేంద్రం విడుదల చేసిన రూ.200 కోట్ల లెక్కలు తేలాలి. వరంగల్‌కు చెందిన ఇద్దరు బిల్లా-రంగా లాంటి ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌ కబ్జాల విషయంలో కవితమ్మ బాటలో నడుస్తున్నారు. నిజామాబాద్‌లో ఎంతో చరిత్ర కలిగిన మహిళా కాలేజీ భూమిని కబ్జా చేసేందుకు కవిత విఫలయత్నం చేసింది.. ఇక్కడి ఎమ్మెల్యేలిద్దరూ నగరంలో గజం భూమి కూడా వదలరని తెలిసింది. ఒక్కొక్కరి మీద 500 కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసింది’’ అని అర్వింద్‌ అన్నారు.


పరస్పరం దాడులు

అర్వింద్‌ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హంటర్‌ రోడ్‌లోని బీజేపీ అర్బన్‌ కార్యాలయంపై దాడికి దిగారు. అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. అప్రమత్తయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆరుగురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అనంతరం బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ క్యాంప్‌ కార్యాలయం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశాయి.


కేసీఆర్‌ ఆదేశాలతోనే దాడి: సంజయ్‌

కొన్ని హిందూ వ్యతిరేకశక్తులు వరంగల్‌లో తనపై దాడిచేశాయని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. హైవేపై తన వాహనాన్ని వెంబడించాయని చెప్పారు. ఒక ప్రజా ప్రతినిధిపై పట్టపగలు దాడి జరగడం సీఎం, హోంమంత్రి డీజీపీలు సిగ్గుపడాల్సిన విషయమని ఆయన విమర్శించారు. వరంగల్‌లో తమ పార్టీ ఎంపీ అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ దాడిచేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే తెలంగాణ ద్రోహులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘మా సహనాన్ని పరీక్షించవద్దు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని మరచిపోవద్దు’’ అని హెచ్చరించారు. ఆదివారం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘కొవిడ్‌, పోతిరెడ్డిపాడు, రైతుల సమస్యలపై బీజేపీ పోరాడుతోంది. అందుకే బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం. మొరగడానికి కొంతమందిని, కరవడానికి కొంతమందిని సీఎం పెట్టుకున్నారు. వాళ్లను చూసి బీజేపీ భయపడదు. శాంతిభద్రతల సమస్య వస్తే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. అర్వింద్‌పై పథకం ప్రకారం దాడి జరిగింది. దాడులను ప్రోత్సహించిన వారిపై, ఈ ఘటనను చూసీచూడనట్లుగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. కాగా, పోలీసుల సమక్షంలో ఎంపీ అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన దాడి.. కేసీఆర్‌ రాక్షస పాలనను తలపిస్తోందని ఎంపీ సోయం బాపురావు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. అర్వింద్‌పై దాడిని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖండించారు. 


టీఆర్‌ఎస్‌ను విమర్శించే స్థాయి అర్వింద్‌కు లేదు: దాస్యం, నన్నపునేని

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ది నీచ చరిత్ర అని, ఆయనకు టీఆర్‌ఎ్‌సపై, తమపై విమర్శలు చేసే స్థాయి, అర్హత లేవని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ ధ్వజమెత్తారు. ఆదివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో వినయ్‌ మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు విద్యార్హత పత్రాలు పెట్టి, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అర్వింద్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మోసపూరిత చరిత్ర కలిగిన అర్వింద్‌ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ ప్రజలను మోసం చేసిన అర్వింద్‌ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము భూములు కబ్జా చేసినట్లు రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.

Updated Date - 2020-07-13T08:39:25+05:30 IST