2019-20 తెలంగాణ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదు: కాగ్ రిపోర్ట్

ABN , First Publish Date - 2022-03-15T16:43:03+05:30 IST

2020-21 సంవత్సరానికి గాను కాగ్ నివేదికను తెలంగాణ సర్కార్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

2019-20 తెలంగాణ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదు: కాగ్ రిపోర్ట్

హైదరాబాద్: 2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని కాగ్ తన నివేదకలో పేర్కొంది.  2020-21 సంవత్సరానికి గాను కాగ్ నివేదికను తెలంగాణ సర్కార్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థితిగతులను ఈ నివేదికలో కాగ్ స్పష్టంగా వివరించింది. బడ్జెట్ పర్యవేక్షణలో నియంత్రణ లేదని, కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారని పేర్కొంది. కొన్ని శాఖల్లో మిగులు బడ్జెట్‌ను తగిన సమయంలో తిరిగి చెల్లించలేదని తెలిపింది. వివిధ శాఖల్లో పదే పదే మిగులు బడ్జెట్ ఏర్పడినా సంబంధిత శాఖలను హెచ్చరించలేదని విమర్శించింది. దీంతో పాటు బడ్జెట్‌ను పుర్తి స్థాయిలో ఖర్చు చేసే శాఖలకు కేటాయింపులు పెంచలేదని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి అధిక వ్యయం ఖర్చు చేస్తుందని తెలిపింది. గత ఐదేళ్లలో 84650.99 కోట్ల అధిక వ్యయాన్ని అసెంబ్లీ ఇంకా క్రమబద్దీకరించలేదని వ్యాఖ్యానించింది.


2019-20 బడ్జెట్ కేటాయింపు లేకుండానే 2084.03 కోట్లు ఖర్చు చేశారని, ఇది రాష్ట్ర శాసన సభ సాధికారతను తగ్గించడమే అని కాగ్ అభిప్రాయపడింది. 2016- 19 సంవత్సరాల మధ్య సామాజిక, ఆర్థిక గ్రాంట్లు నిధుల వినియోగం కేటాయింపుల్లో 50 శాతం కన్నా తక్కువగా ఉందని పేర్కొంది. ఎమర్జెన్సీ నిధుల నుంచి అడ్వాన్సులు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని వివరించింది. వార్షిక పద్దుల సమర్పణలో ప్రభుత్వం జవాబు దారితనం లేదని, దీనివల్ల పద్దుల తయారీ ప్రయోజనం దెబ్బతింటోందని తెలిపింది. కాగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాటించడం లేదని నివేదికలో పేర్కొంది. ఐదు ఏళ్లలో రెవెన్యూ మిగులు లేదని, ద్రవ్యలోటు 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుందని తెలిపింది. బడ్జెట్ అవసరాలకు మించి రుణాలు తీసుకున్నారని, ప్రతి ఏటా రుణాల భారం పెరుగుతోందని చెప్పింది. 2019- 20లో తీసుకున్న రుణాల్లో 75 శాతం అప్పుల చెల్లింపులకు వినియోగించారని... దీని వల్ల రాష్ట్రంలో ఆస్తుల కల్పన మీద ప్రభావం పడిందని వెల్లడించింది.


2019 - 20 సంవత్సరంలో రెవెన్యూ రాబడి స్వల్పంగా 1.11 పెరిగిందని, రెవెన్యూ వ్యయం 12.07 శాతం పెరిగిందని అలాగే వడ్డీ చెల్లింపులు గత సంవత్సరంతో పోలిస్తే 14.30 శాతం పెరిగిందని నివేదకలో తెలిపింది. రెవెన్యూ రాబడి తో పోలిస్తే 14.03 శాతంగా ఉన్న వడ్డీ చెల్లింపులు 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 8.39 శాతం కంటే ఎక్కువని వెల్లడించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వం విద్యా, వైద్యంపై ఖర్చు తక్కువగా ఉందంది. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు ఆలస్యం కావడం వల్ల వ్యయం పెరిగిందని తెలిపింది. ఉదయ్ పథకం కింద ప్రభుత్వం వాటా 4063.65 కోట్లు చెల్లించక పోవడం వల్ల డిస్కంలు నష్టపోయాయని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. 

Updated Date - 2022-03-15T16:43:03+05:30 IST