గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా తెలంగాణ

ABN , First Publish Date - 2022-05-25T05:29:42+05:30 IST

గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా తెలంగాణ

గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా తెలంగాణ
రైతుకు విత్తనాలు అందజేస్తున్న కొండబాల కోటేశ్వర్‌రావు, డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, హనుమంతు

  • రాష్ట్ర విత్తనాభివృద్ధ్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు

రాజేంద్రనగర్‌, మే24(ఆంధ్రజ్యోతి) : గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం  అభివృద్ధ్ది చెందిందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైౖర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు అధ్యక్షతన మంగళవారం రాజేంద్రనగర్‌లో విత్తన మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ, తెలంగాణలో వ్యవసాయం మొదలుపెట్టే రోహిణి కార్తీకి ముందుగానే రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన సంస్థల ద్వారా విత్తనాలను అందజేయడానికి విత్తన మేళా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అందుకు కృషి చేస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌  వి.ప్రవీణ్‌రావును అభినందించారు. విత్తనమేళా ద్వారా రైతులకు విత్తనాలను అందజేయడంతో పాటు శాస్త్రవేత్తల ద్వారా వారికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. 2014లో 3లక్షల విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తే నేడు 6 లక్షల విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 6లక్షల అడుగుల స్టోరేజ్‌ ఇన్‌ప్రాస్ట్రక్షర్‌ను కూడా కల్పించడం జరిగిందన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు మాట్లాడుతూ, దేశ వ్యవసాయ చరిత్రలో ఎన్నడు లేని విదంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం  ఏడేళ్లలో 51 రకాల వంగడాలను రూపొందించి రైతులకు అందజేయడం జరిగిందన్నారు. అందులో 16 రకాల వంగడాలను ఇతర రాష్ట్రాలలో విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులకు వ్యవసాయంలో రిస్క్‌లేని టెక్నాలజీని రూపొందించి అందించడం కోసం, పెట్టుబడి ఖర్చులు తగ్గించే విదానాలు, ఆదాయం పెంచే మార్గాలపై దృిష్టి నిలిిపి పరిశోధనలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం కారణంగా రైతులకు మేలు చేసే అవకాశం లభిస్తున్నదన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే విత్తనాలు నాణ్యమైనవిగా ఉంటాయని నమ్మి రైతులు సొంత ఖర్చులతో విత్తనమేళాకు హాజరైనారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 చోట్ల ఒకే రోజు విత్తన మేళాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజేంద్రనగర్‌లో 1200 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందజేయడం జరిగిందన్నారు. జూలై 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతు మాట్లాడుతూ, అమెరికాతో పాటు భారత్‌లోని ఐసీఏఆర్‌ సంస్థ, ఇతర రాష్ట్రాల వ్యవసాయ శాఖలు కూడా విత్తనమేళాలు నిర్వహిస్తాయని, తెలంగాణలో మాత్రం పంటలు వేసే రోహిణీ కార్తికి ముందు విత్తనాలు రైతులకు అందజేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే విత్తనాలు నాణ్యమైనవిగా ఉంటాయన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు లేబుల్‌ సరిగా చూసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును బద్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ డాక్టర్‌ సుధారాణి, డీన్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ సీమ, విత్తన పరిశోధన సాంకేతిక కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ పి.జగన్మోహన్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:29:42+05:30 IST