Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘కామన్‌సెన్స్‌’ లేదా?

- రైతులపై సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మట్‌ ఆగ్రహం

- వ్యవసాయశాఖ కమిషనర్‌కు సమస్యలు చెబుతుండగా అసహనం

- తుఫాన్ల సమయంలో వినతులు సరికాదని హితవు

- అధికారి తీరుపై అన్నదాతల నిరసన 

సంతబొమ్మాళి, డిసెంబరు 4 :  ‘కామన్‌సెన్స్‌ లేదా?’... ఫిర్యాదు చేయడానికి ఇదేనా సమయం.? తుపాను పరిశీలనకు వచ్చిన సందర్భంలో వినతులు ఇవ్వడం సరికాదు’..అంటూ టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌మర్మట్‌ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను స్థితిగతులను పరిశీలించడానికి వచ్చిన వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణకుమార్‌కు చేపల చెరువులతో నష్టపోతున్నామని రైతులు ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. జవాద్‌ తుపాను నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ను ప్రత్యేకాధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అరుణ్‌కుమార్‌తో పాటు సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేటను సందర్శించారు. అనంతరం జగన్నాథపురం జంక్షన్‌ వద్ద రైతు సంఘం ప్రతినిధులు కోత మధుసూదనరావు, భాస్కరరావు, విష్ణుమూర్తి, కోట నాగయ్యరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ‘తంపరలో వేలాది ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. దీనివల్ల ఏటా పంటలకు వరద ముంపు ఎదురవుతోంది. వేలాది ఎకరాల్లో పంట నష్టపోతున్నాం. సమస్యను పరిష్కరించండి’ అని రైతులు విన్నవించారు. దీనిపై సబ్‌ కలెక్టర్‌ వికాస్‌మర్మట్‌ తీవ్రంగా స్పందించారు. ‘కామన్‌ సెన్స్‌ లేదా? సహాయక చర్యల సమయంలో ఈ ఫిర్యాదులేమిటని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై రైతులు, రైతు సంఘం ప్రతినిధులు చిన్నబోయారు. తమ కష్టాలు చెప్పుకోవడం తప్పు ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. కాన్వాయ్‌ను అడ్డుకొని నిరసన తెలపడానికి సమాయత్తమయ్యారు. త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తామని సబ్‌ కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ సంతబొమ్మాళి, బోరుభద్ర, కారిపేట, భావన పాడు, నౌపడలో పర్యటించి, పునరావాస కేంద్రాలను పరిశీలించారు.

Advertisement
Advertisement