RJD Guidelines: కాళ్ళకు మొక్కించుకోకండి... మంత్రులకు తేజస్వి ఆదేశం...

ABN , First Publish Date - 2022-08-20T19:48:33+05:30 IST

బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తన పార్టీ మంత్రులకు

RJD Guidelines: కాళ్ళకు మొక్కించుకోకండి... మంత్రులకు తేజస్వి ఆదేశం...

పాట్నా : బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తన పార్టీ మంత్రులకు మార్గదర్శకాలను జారీ చేశారు. అందరితోనూ మర్యాదగా ప్రవర్తించాలని, నమస్కారం, ఆదాబ్ అని పలుకరించాలని తెలిపారు. ఎవరైనా పాదాభివందనం చేయడానికి ప్రయత్నిస్తే వారించాలని చెప్పారు. పొదుపుగా ఉంటూ, పారదర్శకతను పాటించాలని తెలిపారు. పూలదండలు, పుష్పగుచ్ఛాలకు బదులుగా పుస్తకాలు, కలాలు స్వీకరించాలని తెలిపారు. 


జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ మంత్రివర్గంలో 31 మంది ఆర్జేడీ మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులంతా పాటించవలసిన ఆరు మార్గదర్శకాలను తేజస్వి యాదవ్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఆర్జేడీ మంత్రులు తమ కోసం కొత్తగా కార్లను కొనవద్దని చెప్పారు. అందరితోనూ మర్యాదగా ప్రవర్తించాలని, సంప్రదాయబద్ధంగా నమస్తే, ఆదాబ్ అంటూ పలుకరించాలని చెప్పారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నిస్తే, వారిని వారించాలని చెప్పారు. పూలదండలు, పుష్పగుచ్ఛాలకు బదులుగా పుస్తకాలు, పెన్‌లను ఇవ్వడం ప్రోత్సహించాలని తెలిపారు. పేదలు, అవసరార్థులకు ఏదైనా పని చేయవలసి వస్తే, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. వారి కుల, మతాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దని తెలిపారు. తమ తమ శాఖల్లో పారదర్శకత, నిజాయితీలను ప్రోత్సహించాలన్నారు. 


రాష్ట్రంలో ఏ పనులు చేయాలనుకుంటున్నారు? చేసిన అభివృద్ధి పనులు ఏమిటి? వంటి వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయాలని తెలిపారు. దీనివల్ల చేసిన పనుల గురించి ప్రజలు తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. 


ఆటవిక పాలన వచ్చిందని బీజేపీ ఆరోపిస్తున్న తరుణంలో ఆర్జేడీకి మంచి పేరు తీసుకొచ్చే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. 243 స్థానాలున్న శాసన సభలో  జేడీయూ, ఆర్జేడీ కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ నెల 24న శాసన సభలో ఆధిక్యతను నిరూపించుకునే అవకాశం కనిపిస్తోంది. 


Updated Date - 2022-08-20T19:48:33+05:30 IST