బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అరెస్టు

ABN , First Publish Date - 2022-04-13T21:55:08+05:30 IST

ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో పర్యటించేందుకు వెళ్తున్న..

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అరెస్టు

జైపూర్: ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో పర్యటించేందుకు వెళ్తున్న బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య, పలువురు బీజేపీ నేతలను పోలీసులు బుధవారంనాడు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా, ఇతర మద్దతుదారులను దౌసా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి ముందు, కరౌలీలో ప్రజలను కలుసుకుని సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నట్టు ఒక ట్వీట్‌లో తేజస్వి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తౌమ్ కరౌలీ వెళ్తామని, శాంతియుతంగా వెళ్లేందుకు తాము ప్రయత్నిస్తామని, పోలీసులు అడ్డుకుంటే సామూహికంగా అరెస్టవుతాయమని పార్టీ మద్దతుదారులతో మాట్లాడుతూ తేజస్వి చెప్పారు. ప్రదర్శకులు ముందుకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా,  బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోని తీసుకున్నారు.


ఈనెల 2వ తేదీన కరౌలీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా వారం రోజులకు పైగా అక్కడ కర్ఫూ అమలు చేశారు. హిందూ నూతన సంవత్సరం సందర్భంగా కొందరు బ్యాక్ ర్యాలీ తీశారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం గుండా వెళ్తుండగా రాళ్లు రువ్వుడు ఘటన చోటుచేసుకుంది. ర్యాలీలోని కొందరు ''రెచ్చగొట్టే వ్యాఖ్యలు" చేయడంతో రాళ్లదాడి చోటుచేసుకుందని, దీంతో 8 మంది తమ సిబ్బందితో సహా 11 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు చెబుతున్నారు. దుకాణాలు, ఇళ్లకు సైతం అల్లరిమూక నిప్పుపెట్టింది. విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బజ్‌రంగ్ దళ్ ఈ ర్యాలీ తీసినట్టు పోలీసులు తెలిపారు. వారం రోజుల కర్ఫ్యూ అనంతరం ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి నెలకొన్నప్పటికీ, తేజస్వి సూర్య సారథ్యంలోని బీజేపీ ప్రతినిధి బృందం పర్యటనకు సిద్ధం కావడంతో రాష్ట్రప్రభుత్వం కరౌలీకి అదనపు బలగాలను పంపింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం మంగళవారంనాడు కరౌలీలో పర్యటించారు.

Updated Date - 2022-04-13T21:55:08+05:30 IST