Giriraj Vs Tejaswi: ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేసిన గిరిరాజ్‌పై తేజస్వి ఫైర్..

ABN , First Publish Date - 2022-08-12T22:42:14+05:30 IST

బీజేపీ ఫైర్‌బ్రాండ్ గిరిజాజ్ సింగ్‌, బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మధ్య ట్విట్టర్ వార్..

Giriraj Vs Tejaswi: ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేసిన గిరిరాజ్‌పై తేజస్వి ఫైర్..

పాట్నా: బీజేపీ ఫైర్‌బ్రాండ్ గిరిజాజ్ సింగ్‌, బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మధ్య ట్విట్టర్ వార్ చోటుచేసుకుంది. గిరిరాజ్ ట్వీట్‌పై తేజస్వి మండిపడటంతో పాటు తన ఇంటర్వ్యూను ఎడిట్ చేసి షేర్ చేశారంటూ గిరిరాజ్‌ను విమర్శిస్తూ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


బీహార్‌లో బీజేపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్న గిరిరాజ్ తాజాగా తేజస్వి ఇంటర్వ్యూకు చెందిన ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. ''సీఎం కాగానే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఉప ముఖ్యమంత్రిని'' అని తేజస్వి ఆ వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. తేజస్వి తన హామీ  నుంచి వెనక్కి తగ్గారంటూ గిరిరాజ్ ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే తేజస్వి కూడా అంతే వేగంగా స్పందించారు.  తన ఇంటర్వ్యూకు చెందిన పూర్తి క్లిప్‌ను ఆయన షేర్ చేశారు. ఉద్యోగాల విషయాన్ని సీఎం నితీష్ దృష్టికి తెచ్చానని, ఆయన కూడా దానిని సీరియస్‌గానే తీసుకున్నారని, ఉద్యోగాల కల్పన హామీకి కట్టుబడతామని, అయితే, విశ్వాస పరీక్షలో ముందు నెగ్గాలని తేజస్వి చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తేజస్వి తన వీడియోను షేర్ చేయడంతో పాటు గిరిరాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మిస్టర్, ఒక అడుగు పిలక (one-foot-long ponytail) ఉన్నంత మాత్రాన మీరు జ్ఞాని అయిపోరు. మీ దిగజారుడు చర్యలు, దిగజారుడు బహిరంగ ప్రకటనలు బీజేపీకి దెబ్బగా మారింది'' అని తేజస్వి అన్నారు.


తేజస్వి తన తల్లిదండ్రులు, సోదరీమణులతో రాఖీపౌర్ణమి వేడుకలు జరుపుకొనేందుకు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆగస్టు 15 వేడుకల తర్వాత బీహార్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అప్పటికే యాదవ్ తిరిగి బీహార్ చేరుకుంటారు. ఈ నెల ద్వితీయార్థంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుండగా, నితీష్ కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది.

Updated Date - 2022-08-12T22:42:14+05:30 IST