Apr 15 2021 @ 18:37PM

తేజ సజ్జా ‘ఇష్క్‌’ చిత్రంపై నితిన్‌ రియాక్షన్‌ ఇదే

సౌత్‌లోని టాప్‌ బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించేందుకు రెడీ అయింది. అందులో భాగంగా ఇటీవ‌ల 'జాంబీ రెడ్డి' మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో  'ఇష్క్‌` అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంతో య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న గ్రాండ్‌గా విడుద‌ల‌ కాబోతోన్న సందర్భంగా.. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను గురువారం సుప్రీమ్ హీరో సాయి తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్‌ విడుదల సందర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రయూనిట్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ''మళ‌యాలంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఓ మంచి సినిమాను తెలుగులో ఇష్క్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మెగా గుడ్‌ ఫిలింస్‌ సంస్థలో సినిమా అంటేనే రిచ్‌గా ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే ఉండ‌బోతుంది. కొత్త త‌ర‌హా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల అందరికీ ఇష్క్‌ సినిమా నచ్చుతుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్ వ‌ర‌కూ  ప్రేక్షకుల‌ను ఎంగేజ్ చేస్తుంది. జాంబీరెడ్డి సినిమాతో తేజ తొలి సక్సెస్‌ కొట్టాడు. ఈ సినిమా తేజ ఖాతాలో మరో సక్సెస్‌గా నిలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి చిత్రయూనిట్‌ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ''తేజ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరోలా కనిపిస్తున్నాడు. ‘జాంబీరెడ్డి` వంటి మంచి సినిమా తర్వాత మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ వంటి మంచి బ్యానర్‌లో తేజ సజ్జా చేసిన ఇష్క్ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.


హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ''మా ఇష్క్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో సాయితేజ్‌ గారికి ధన్యవాదాలు. అలాగే ‘ఇష్క్‌’ టైటిల్‌తో నితిన్‌గారి సినిమా ఉంది. మీ సినిమా టైటిల్‌ ఉపయోగించుకుంటున్నాము అనగానే నితిన్‌గారు సరే అనడమే కాకుండా... మా సినిమాలోని ‘ఆనందం...’ సాంగ్‌ కూడా ఆయన రిలీజ్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా నితిన్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్‌ 23న మా ‘ఇష్క్‌’ సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. ఇది ఒక కొత్త రకం కథ. ‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్‌ జానర్‌ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్‌’. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆడియన్స్‌కు న్యూ కైండ్‌ ఆఫ్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. కొంత గ్యాప్‌ తర్వాత వ‌స్తున్న మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్ వారు ఫ‌స్ట్ సినిమా నాతో చేయ‌డం సంతోషంగా ఉంది. ‌మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలనే ఈ సంస్థ వారు ప్రోత్సహిస్తుంటారు. ‘ఇష్క్‌’ సినిమాలో కూడా మంచి కంటెంట్‌ ఉంది. త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి న‌చ్చే చిత్ర‌మిది" అన్నారు.