తహసీల్దారు కార్యాలయం.. ఆ అధికారి రాజ్యం

ABN , First Publish Date - 2022-08-11T05:46:57+05:30 IST

బొమ్మనహాళ్‌ తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి రింగ్‌ మాస్టర్‌గా మారాడు. ఆయనతో పెట్టుకుంటే బదిలీ తప్పదని అంటున్నారు.

తహసీల్దారు కార్యాలయం.. ఆ అధికారి రాజ్యం
బొమ్మనహాళ్‌ తహసీల్దారు కార్యాలయం

రింగ్‌ మాస్టర్‌

తహసీల్దారు కార్యాలయం.. ఆ అధికారి రాజ్యం

దోస్తీ కడితే కాసులు.. ఎదురు తిరిగితే సినిమా

బంధువు ద్వారా ఒప్పందాలు.. ముడుపులు

అధికార పార్టీవారూ కప్పం కట్టాల్సిందేనట


బొమ్మనహాళ్‌ తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి రింగ్‌ మాస్టర్‌గా మారాడు. ఆయనతో పెట్టుకుంటే బదిలీ తప్పదని అంటున్నారు. రెవెన్యూ శాఖ వ్యవహారాలలో ఆయన రూ.లక్షలు వసూలు చేసే అధికారిగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అతని కనుసన్నల్లోనే ముడుపుల వ్యవహారాలు జరుగుతాయి. అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్నా, ఏవైనా విధులు నిర్వర్తించాలన్నా ఆయనే డిసైడ్‌ చేస్తారని సమాచారం. ఆయన వ్యవహారాల గురించి ఉన్నతాధికారులకు తెలిసినా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిస్సహాయస్థితిలో ఉంటున్నారు. పైగా, అతనిపై ఈగ వాలకుండా చూసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో రెవెన్యూ భూములను ఎవరికి కేటాయించాలో తుది నిర్ణయం కూడాఅతని మీదే ఆధారపడి ఉంటోందని సమాచారం. 

- రాయదుర్గం


కలిస్తే.. కాసులే..

- బొమ్మనహాళ్‌ మండలంలో పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు, మ్యుటేషన లాంటి పనులు ఆయనకు తెలియకుండా అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి. అతనితో దోస్తీ కడితే భోగభాగ్యాలే..! వైరం పెట్టుకుంటే బదిలీ తప్పదు..! ఈ రెండు బలమైన సంకేతాలను తన పరిధిలో అధికారులు, సిబ్బందికి పంపించారు. దీంతో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అతని కనుసన్నల్లో ఉండేందుకే ఎక్కువమంది ఇష్టపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. 


- గతంలో పనిచేసిన తహసీల్దారు శ్రీధరఘట్ట, సింగేపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులకు ధారాదత్తం చేసేందుకు ఒప్పుకోలేదు. ఆ పనిచేస్తే లక్షల రూపాయలు సమర్పిస్తామని కీలక అధికారి తీవ్రస్థాయి ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. కానీ ఆ తహసీల్దారు ఒప్పుకోలేదు. ఏకంగా సెలవుపెట్టి, బదిలీపై వెళ్లిపోయినట్లు చర్చ సాగుతోంది. ఓ వీఆర్వో కూడా అతని వేధింపులు తట్టుకోలేక, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయలేక, సెలవులో వెళ్లి, బదిలీ చేయించుకున్నారని తెలిసింది. పెత్తనం పూర్తిగా ఆయన చేతిలోనే ఉండటంతో, ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి అధికారులకు ఏర్పడింది. 


ఎవరి మాటా చెల్లదు...

- బొల్లనగుడ్డం సర్పంచ గాదిలింగ ఇటీవల సోషల్‌ మీడియాలో వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కరించి మరీ రెవెన్యూ వ్యవహారాలపై వాట్సా్‌పలో ఓ పోస్టు పెట్టారు. ఆయన ఆవేదన వైరల్‌ అయ్యింది. పాసు పుస్తకాల కోసం కార్యాలయానికి వెళితే, కొర్రీలు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. అయినా, అధికార పార్టీవారు ఆ అధికారికే వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. 


- మామూళ్ల కలెక్షన్లకు, వ్యవహారాలను నడిపేందుకు ఆ అధికారి తన బంధువును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. ఆయన వద్దకు వెళ్లి సమస్యను వివరించి, ముడుపుల గురించి ఒప్పందం చేసుకుంటే పని జరిగిపోయినట్లే అంటున్నారు. అందుకే చాలామంది తహసీల్దారు కార్యాలయానికి వెళ్లడానికి ముందు బంధువును ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. 


అదే ఆయన బలం

అధికార పార్టీ నాయకులకు ఆయన గురించి చెప్పి, గోడు వెల్లబోసుకున్నామని, అయినా వారు స్పందించే పరిస్థితిలో లేరని కొందరు బాధితులు అంటున్నారు. పైగా ఆ అధికారిది, ముఖ్య నేతదీ ఒకే సామాజికవర్గం. దీంతో పై నుంచి కిందివరకు పూర్తిస్థాయి అండదండలు అందుతున్నట్లు తెలిసింది. ఈ కారణంగానే అధికార పార్టీ నాయకులు కిమ్మనడం లేదని అంటున్నారు. అధికార పార్టీ గ్రామస్థాయి నాయకులు సైతం పనులు చేయించుకునేందుకు ఆ అధికారికి బంధువు ద్వారా ముడుపులు చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తమ పరిస్థితి ఇలా ఉందని వారు లోలోపల మదన పడుతున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-08-11T05:46:57+05:30 IST