తీపి కబురు

ABN , First Publish Date - 2022-05-29T06:19:19+05:30 IST

నల్లబెల్లం అమ్మకాలు, నిల్వలపై ఎటువంటి అభ్యంతరాలు పెట్టవద్దని హైకోర్టు ఆదేశించడంతో అనకాపల్లి బెల్లం మార్కెట్‌ వ్యాపారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తీపి కబురు
అనకాపల్లి బెల్లం మార్కెట్‌

- నల్లబెల్లం అమ్మకాలు, నిల్వలపై అభ్యంతరాలు పెట్టవద్దని హైకోర్టు ఆదేశం

- స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని జిల్లా సెబ్‌ ఏఎస్పీ ప్రకటన

- అనకాపల్లి బెల్లం వ్యాపార, రైతు వర్గాల్లో హర్షాతిరేకాలు

అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

నల్లబెల్లం అమ్మకాలు, నిల్వలపై ఎటువంటి అభ్యంతరాలు పెట్టవద్దని హైకోర్టు ఆదేశించడంతో అనకాపల్లి బెల్లం మార్కెట్‌ వ్యాపారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సంతపేట బెల్లం మార్కెట్‌లో ఒక వ్యాపారి నుంచి మార్చి 12న ఆ జిల్లాకు చెందిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు నల్లబెల్లం నిల్వలను జప్తు చేశారు. ప్రొహిబిషన్‌ చట్టం కింద ఆయనపై కేసు కూడా నమోదైంది. దీనిపై ఆ వ్యాపారి హైకోర్టును ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై పై విచారణ జరిపిన హైకోర్టు నల్లబెల్లం కలిగి ఉండడం, రవాణా కారణాలు చూపి జప్తు చేయడం సరికాదని శుక్రవారం తేల్చి చెప్పింది. నల్లబెల్లం కలిగి ఉండడం, రవాణా ఎంతమాత్రం నేరం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై నల్లబెల్లం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌గా గుర్తింపు ఉంది. నిత్యం ఇక్కడ నుంచి బిహార్‌, ఒడిశా, బెంగాళ్‌ తదితర  రాష్ట్రాలకు బెల్లాన్ని ఎగుమతి చేస్తారు. ఇటీవల జిల్లా పోలీసు శాఖ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు నల్లబెల్లం విక్రయాలు, నిల్వలపై ఆంక్షలు విధించారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా ఎస్పీగా గౌతమి శాలి బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలో 2.0 కార్యక్రమంలో భాగంగా సారా రహిత జిల్లాగా మార్చేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్‌ నుంచి నిషేధిత నాటుసారా తయారీకి బెల్లం తరలిపోతోందనే ఉద్దేశంతో ముఖ్యంగా నల్లబెల్లం అమ్మాలన్నా, కొనాలన్నా ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నాటు సారా తయారీకి ప్రధాన ముడి సరకుగా ఉపయోగించే నల్లబెల్లాన్ని సారా తయారీదారులకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. నాటుసారా కేసులలో పలుమార్లు దొరికిన ముద్దాయిలకు నల్లబెల్లాన్ని విక్రయించవద్దని విశాఖ రేంజి డీఐజీ ఆధ్వర్యంలో బెల్లం వర్తకులకు సమావేశం ఏర్పాటు చేసి మరీ తెలిపారు. దీంతో అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో నల్లబెల్లం విక్రయాలను అదుపు చేయాలని పోలీసులు భావించారు. దీనిపై అటు రైతులు, ఇటు వర్తకులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నల్లబెల్లం సారాకు వినియోగించడంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, తమపై ఆంక్షలు విధించి, వేధింపులకు పాల్పడుతున్నారని వ్యాపారులు ఈనెల 19వ తేదీ నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు బెల్లం మార్కెట్‌లో లావాదేవీలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేసేది లేదని హామీ ఇవ్వడంతో రెండు రోజుల కిందటే మార్కెట్‌లో మళ్లీ లావాదేవీలు మొదలయ్యాయి. ప్రస్తుతం అనకాపల్లి బెల్లం మార్కెట్‌పై ఆధారపడి ఐదు నుంచి ఆరు వేలమంది రైతులు, బెల్లం వ్యాపారులు 60 మంది వరకు ఉన్నారు. కొలగార్లు, కార్మికులు, గుమస్తాలు కలిపి మొత్తం 450 మంది వరకు మార్కెట్‌పై ఆధారపడి ఉన్నా, నల్లబెల్లంపై ఆంక్షలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోగా స్థానిక పోలీసులు మాత్రం బెల్లం వ్యాపారుల కోసం ఒక ప్రకటన విడుదల చేశారు. తాము బెల్లం వ్యాపారులను వేధిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, బెల్లం వ్యాపారులపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎటువంటి అపోహలు లేకుండా వ్యాపార లావాదేవీలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు అనకాపల్లి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ఏఎస్పీ బి.విజయభాస్కర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో  బెల్లం వ్యాపారులు రెండు రోజుల కిందట నుంచే మళ్లీ బెల్లం మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలు మొదలు పెట్టారు. తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బెల్లం నిల్వలు, రవాణా విషయంలో తీర్పునిచ్చిన నేపథ్యంతో అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో వ్యాపారులు, రైతు వర్గాల్లో నెలకొన్న అపోహలకు పరిష్కార మార్గం దొరికినట్లైంది. కోర్టు తీర్పు రావడం శుభ పరిణామమని, వ్యాపారులు, రైతులు  ఎటువంటి ఆంక్షలు లేకుండా లావాదేవీలు జరుపుకునే అవకాశం వచ్చిందని అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మినారాయణ ’ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. 


Updated Date - 2022-05-29T06:19:19+05:30 IST