యునెస్కో గుర్తింపుతో రియల్టర్లకు ప్రయోజనం

ABN , First Publish Date - 2022-01-23T06:06:22+05:30 IST

యునెస్కో గుర్తింపుతో రియల్టర్లకు ప్రయోజనం

యునెస్కో గుర్తింపుతో రియల్టర్లకు ప్రయోజనం

రామప్ప అభివృద్ధిని మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

బీజేపీ నేత తీన్మార్‌ మల్లన్న

వెంకటాపూర్‌(రామప్ప), జనవరి 22: ఎన్నో విశిష్టతలకు కలిగిన రామప్ప దేవాలయానికి దక్కిన యునెస్కో గుర్తింపు రియల్‌ ఎస్టేట్‌ దందాకే పనికొచ్చిందని, తప్ప ఆలయాభివృద్ధి జరగడం లేదని బీజేపీ నాయకుడు తీన్మార్‌ మల్లన్న అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం  పాలంపేటలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు.  ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడం శుభసూచకమన్నారు. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు. ఇట్లా యునెస్కో గుర్తింపు వచ్చిందోలేదో రియల్టర్లు భూముల ధరలు పెంచి దందా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప పరిరక్షణ, అభివృద్ధిని మర్చిపోయినట్లు కనిపిస్తోందని అన్నారు. ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న రామప్పపై ఇరు ప్రభుత్వాలు భేషజాలు పక్కకుపెట్టి అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య జవహర్‌లాల్‌,  నాయకులు కారుపోతుల యాదగిరి గౌడ్‌, గంగుల రాజు కుమార్‌, తంగళ్లపల్లి శ్రీధర్‌, సారంగపాణి, బీట్ల ప్రసాద్‌, రమేష్‌, శరత్‌, గువ్వ సాంబయ్య ఉన్నారు. 

ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మగా నామకరణం చేయాలి

 ములుగు కలెక్టరేట్‌ : ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మగా నామకరణం చేయాలని తీన్మార్‌ మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  ములుగు సమీపంలోని గట్టమ్మతల్లిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్‌తో జిల్లా నామకరణంపై చర్చించారు.  జిల్లా సాధన సమితి రూపొందించిన కరపత్రాన్ని  ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన సీఎం కేసీఆర్‌ ములు గు జిల్లాను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు.  ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరలోగాు ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మగా నామకరణం చేయాలని  డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, నాయకులు వాసుదేవరెడ్డి, రాజు నాయక్‌, భూక్య జవహర్‌, మహేందర్‌, మొగుళ్ల భద్రయ్య, అచ్చునూరి కిషన్‌, లైశెట్టి రవిరామన్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-01-23T06:06:22+05:30 IST