టీనేజర్ల పీరియడ్‌ కిట్‌

ABN , First Publish Date - 2020-05-28T05:30:00+05:30 IST

చాలామంది అమ్మాయిలు నెలసరి సమయంలో పడుతున్న ఇబ్బందులు వారు గ్రహించారు. ఆ సమయంలో స్నేహితురాళ్లు దుస్తులకు రక్తం మరకలున్నాయేమోనని ఇబ్బంది పడటం, శానిటరీ

టీనేజర్ల పీరియడ్‌ కిట్‌

నెలసరి విషయంలో అమ్మాయిలు

ఏ మాత్రం సిగ్గుపడకుండా... వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు 14 ఏళ్ల సంచికా మోతానీ, అనికా తనేజాలు

‘లిటిల్‌ లేడీ’ పీరియడ్‌ కిట్‌ను రూపొందించారు. ఈ కిట్‌లో రెండు ఆర్గానిక్‌ ప్యాడ్స్‌, 

ఒక శానిటైజర్‌, ఒక ప్యాకెట్‌ పర్‌ఫ్యూమ్‌, హీట్‌ ప్యాడ్‌తో పాటు ఒక డార్క్‌ చాక్లెట్‌ కూడా ఉంటుంది. 


చాలామంది అమ్మాయిలు నెలసరి సమయంలో పడుతున్న ఇబ్బందులు వారు గ్రహించారు. ఆ సమయంలో స్నేహితురాళ్లు దుస్తులకు రక్తం మరకలున్నాయేమోనని ఇబ్బంది పడటం, శానిటరీ ప్యాడ్స్‌ను ఎవరికీ కనపడకుండా దాచిపెట్టుకుని తీసుకురావడం, వాటిని కొనడానికి సిగ్గుపడటం వంటి దృశ్యాలు ప్రతీ నెలా వారికి కనిపించేవి. నిజానికి సంచికా, అనికాలు ఢిల్లీలోని శ్రీరామ్‌ స్కూలుకు చెందిన వేర్వేరు క్యాంప్‌సలలో చదువుతున్నారు. వాళ్లిద్దరూ ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అకాడమీ’ (వైఈఏ)లో కలుసుకున్నారు. అక్కడ మేథోపరమైన చర్చలు, సరికొత్త ఆలోచనలకు అంకురార్పణ జరిగే వివిధ సెషన్స్‌లో తామిద్దరం ఒకే అంశంపై ఆసక్తిగా ఉన్నట్టుగా గ్రహించారు. అక్కడే ‘లిటిల్‌ లేడీ’కి బీజం పడింది. ‘‘ఇది పీరియడ్‌ రెడీ కిట్‌. టీనేజీలో ఉన్న అమ్మాయిలకు నెలసరి సమయంలో ఏమేం కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. పీరియడ్స్‌ అనేవి అమ్మాయిల శరీరంలో జరిగే సాధారణ ప్రక్రియ. దానికి సంసిద్ధమై డార్క్‌ చాక్లెట్‌ తింటూ ఎంజాయ్‌ చేయాలేగానీ సిగ్గుపడకూడదు’’ అని అనికా చెబుతోంది.


పీరియడ్‌ డైరీ కూడా...

సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాలను కూడా వారిద్దరూ నిశితంగా గమనిస్తున్నారు. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేకపోవడం నుంచి గుజరాత్‌లో కాలేజీ అమ్మాయిల్లో ఎవరెవరు నెలసరిలో ఉన్నారో చెప్పాలంటూ హాస్టల్‌ వార్డెన్‌ వారిని ‘స్ట్రిప్‌’ చేయడం దాకా... ఇలాంటి అనేక సంఘటనలు నెలసరి చుట్టే తిరగడం గ్రహించారు. ‘వైఈఏ’ ప్రాజెక్టులో భాగంగా ఎంతోమంది విద్యార్థినులను కలిసి నెలసరి విషయంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆ సమయంలో ఒత్తిడికి గురికావడం, అసౌకర్యం, అవమానాలను ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుని ‘లిటిల్‌ లేడీ’ పీరియడ్‌ కిట్‌కు రూపకల్పన చేశారు. ‘‘ఇందులో మేము పీరియడ్‌ డైరీ కూడా ఇస్తున్నాం. ఇందులో నెలసరికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆరోగ్యకరమైన డైట్‌కు సూచనలు, నెలసరి తేదీలను ట్రాక్‌ చేసే క్యాలెండర్‌ కూడా ఉంటాయి. చాలా సమాచారాన్ని సేకరించిన తర్వాత వీటిని రూపొందించాం’’ అని సంచికా తెలిపారు. 


సోషల్‌ మీడియా ద్వారా...

వీరి ప్రయత్నానికి ‘వైఈఏ’ ఫండింగ్‌ చేసింది. ఈ కిట్‌లోని కొన్నింటిని శానిటరీ న్యాప్కిన్‌ వాడకంలో విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న ‘ప్రతిసంధి’ అనే ఎన్జీవో సమకూర్చింది. కొన్నింటిని ఆర్డర్‌ ఇచ్చి తయారుచేయించారు. ఈ కిట్‌ ధరను లాభాపేక్ష లేకుండా ప్రాథమికంగా 750 రూపాయలుగా నిర్ణయించారు. ‘లిటిల్‌ లేడీ’ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ప్రీ ఆర్డర్స్‌ సంపాదించారు. మార్కెటింగ్‌ స్ట్రాటెజీని ఏర్పాటుచేసుకుని పెద్ద మొత్తంలో మార్కెట్‌ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారీ టీనేజర్స్‌. ‘‘పేరెంట్‌ మీటింగ్స్‌, ఓరియెంటేషన్‌ మీటింగ్స్‌, స్కూల్‌ క్యాంప్‌సల వంటి ఫోరమ్‌ల ద్వారా వీటి అమ్మకాలు జరపాలనుకుంటున్నాం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌ను కూడా సంప్రదిస్తున్నాం. అవగాహన కార్యక్రమాలకు కూడా మమ్మల్ని కొన్ని ఫార్మా కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి’’ అంటున్న వీరిద్దరూ నెలసరి అనేది డిన్నర్‌ టేబుల్‌ టాపిక్‌ కావాలని కోరుకుంటున్నారు.


‘లిటిల్‌ లేడీ’ పీరియడ్‌ కిట్‌లో పీరియడ్‌ డైరీ కూడా ఇస్తున్నాం. ఇందులో నెలసరికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆరోగ్యకరమైన డైట్‌కు సూచనలు, నెలసరి తేదీలను ట్రాక్‌ చేసే క్యాలెండర్‌ కూడా ఉంటాయి. చాలా సమాచారాన్ని సేకరించిన తర్వాతనే వీటిని రూపొందించాం.

Updated Date - 2020-05-28T05:30:00+05:30 IST