Texas Shooting ఘటనలో వెలుగులోకి కొత్త కోణం.. స్కూల్లో 21 మందిపై 18 ఏళ్ల కుర్రాడు కాల్పులు జరపకముందే ఇంట్లో..

ABN , First Publish Date - 2022-05-25T17:42:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) ఓ పాఠశాలలో 18 ఏళ్ల స్కూల్ విద్యార్థి తన తోటి విద్యార్థులపై కాల్పులు జరపడంతో 19 మంది చిన్నారులతో సహా 21 మంది చనిపోయారు.

Texas Shooting ఘటనలో వెలుగులోకి కొత్త కోణం.. స్కూల్లో 21 మందిపై 18 ఏళ్ల కుర్రాడు కాల్పులు జరపకముందే ఇంట్లో..

టెక్సాస్‌: అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) ఓ పాఠశాలలో 18 ఏళ్ల స్కూల్ విద్యార్థి తన తోటి విద్యార్థులపై కాల్పులు జరపడంతో 19 మంది చిన్నారులతో సహా 21 మంది చనిపోయారు. మెక్సికన్‌ సరిహద్దులోని ఉవాల్డే నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులు జరిపింది 18 ఏళ్ల టీనేజర్ Salvador Ramos గా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాల్వడార్ రామోస్ స్కూల్‌కు బయల్దేరడానికి ముందే ఇంటి వద్ద ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు.


ఇంటి వద్ద నాన్నమ్మపై కాల్పులు జరిపి అదే తుపాకీతో స్కూల్‌కు వెళ్లాడు. అనంతరం పాఠశాలలో తోటి విద్యార్థులపై విచక్షణరహితంగా కాల్పులకు తెగపడ్డాడు. 21 మందిని పొట్టనబెట్టుకున్నాడు. కాగా, ఇంటి వద్ద తీవ్రంగా గాయపడిన ముసలావిడాను పోలీసులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇటీవలే Salvador Ramos ఆ తుపాకీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గన్ కొన్న తర్వాత తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో దాని తాలూకు ఫొటోను సైతం అతడు అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 


ఇక కాల్పుల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు Salvador Ramos మృతి చెందినట్లు టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్‌ అబాట్‌ తెలిపారు. కాగా, 2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్‌ విద్యార్థులతో సహా ముగ్గురు టీచర్లు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యంలో ఇదే అత్యంత దారుణ సంఘటనగా పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన అధ్యక్షుడు.. దేశంలోని గన్ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.   

Updated Date - 2022-05-25T17:42:44+05:30 IST