టీకా లేక..!

ABN , First Publish Date - 2021-04-15T05:44:18+05:30 IST

సగం లక్ష్యం కూడా నెరవేరకుండానే జిల్లాలో ‘టీకా ఉత్సవ్‌’ ముగిసింది.

టీకా లేక..!
వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రద్దీ

అసంపూర్తిగానే ముగిసిన ‘ఉత్సవ్‌’ 

వ్యాక్సిన్‌ కోసం పోటెత్తిన జనం 

జిల్లాకు 60 వేల డోసులు 

అయినా కొరతే

రెండు గంటల్లోనే ఖాళీ

వెనుదిరిగిన ప్రజలు 


సగం లక్ష్యం కూడా నెరవేరకుండానే జిల్లాలో ‘టీకా ఉత్సవ్‌’ ముగిసింది. జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించిన చివరి రోజు టీకా ఉత్సవ్‌కు జనం పోటెత్తారు. కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రక్షణ పొందేందుకు వ్యాక్సిన్‌ తీసుకోవడమే మేలని వైద్యనిపుణులు చెబుతుండటంతో ప్రజలు అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా, రెండు గంటల్లోనే డోసులు అయిపోయాయని వైద్యాధికారులు చెప్పడంతో వందలాది మంది ఉసూరుమంటూ వెనుదిరిగారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన ‘టీకా ఉత్సవ్‌’లో రెండు లక్షల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాలని జిల్లా అధికారులు ప్రణాళికను రూపొందించారు. అయితే దఫదఫాలుగా జిల్లాకు వచ్చిన దాదాపు 4 లక్షల వ్యాక్సిన్‌ డోసులు ‘టీకా ఉత్సవ్‌’కు ముందే అయిపోవడంతో, అందుబాటులో ఉన్న 20 వేల డోసులతోనే ఈనెల 11న టీకా ఉత్సవ్‌ను ప్రారంభించారు. వ్యాక్సిన్‌ విషయంలో ఉన్న అపోహల కారణంగా కొంతకాలంగా ఊగిసలాటలో ఉన్న వారు కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ భయంతో సచివాలయాల వద్ద భారీసంఖ్యలో క్యూలు కట్టారు. టీకా కొరత కారణంగా తొలిరోజు సుమారు మూడొంతుల సచివాలయాల్లో ఉత్సవం ప్రారంభమే కాలేదు. అవసరమైన డోసులను వెంటనే పంపించాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, రాకపోవడంతో 12వ తేదీన జిల్లాలో విరామం ప్రకటించారు. మూడోరోజు ఉగాది కారణంగా సెలవు ప్రకటించారు. ఉత్సవ్‌ చివరిరోజైన బుధవారం జిల్లాకు 60 వేల డోసుల వ్యాక్సిన్‌ వచ్చింది. వీటిని ఎంపిక చేసిన 130 గ్రామ, వార్డు సచివాలయాలకు సర్దుబాటు చేశారు. అయితే బుధవారం ఉదయమే సచివాలయాల వద్ద భారీసంఖ్యలో ప్రజలు బారులుతీరినా, ముందున్న వంద, రెండొందల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వగలిగారు. చాలా సచివాలయాల్లో రెండు గంటల్లోనే వ్యాక్సిన్‌ అయిపోయినట్టు వైద్యాధికారులు ప్రకటించడంతో ఉదయం నుంచి నిరీక్షించిన జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు. 


55 వేల మందికి వ్యాక్సిన్‌

జిల్లావ్యాప్తంగా 55 వేల మందికి టీకా అందించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ప్రకటించారు. ‘టీకా ఉత్సవ్‌’లో తొలిరోజు దాదాపు 15 వేల మందికి, చివరి రోజు సుమారు 55 వేల మందికి.. మొత్తం కలిపి 70 వేల మందికి మాత్రమే టీకా అందించగలిగారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలనే లక్ష్యంలో సగం మందికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వలేకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-04-15T05:44:18+05:30 IST