నేటి నుంచి టీకా ఉత్సవ్‌

ABN , First Publish Date - 2021-04-11T05:54:29+05:30 IST

నేటి నుంచి టీకా ఉత్సవ్‌

నేటి నుంచి టీకా ఉత్సవ్‌

వ్యాక్సినేషన్‌ అనుమతి కోసం 14ప్రైవేట్‌ ఆసుపత్రుల ఎదురుచూపు

ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్‌ 10: దేశవ్యాప్తంగా ఆదివారంనుంచి 14వ తేదీ వరకు ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సర్యూలర్స్‌ జారీ చేశారు. మహాత్మా జ్యోతిరావ్‌పూలే జయంతి ఉత్సవం నుంచి డాక్టర్‌ బాబాసాహిబ్‌ అంబేద్కర్‌ జయంతి వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని పిలుపునిచ్చారు. వీటితో పాటుగా ఏప్రిల్‌లో ఎటువంటి సెలవులు లేకుండా ప్రతిరోజు వ్యాక్సినేషన్‌ చేయాలని, 45ఏళ్లు పైబడిన వారికి త్వరగా వ్యాక్సినేషన్‌ పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశాలిచ్చారు. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలపై గందరగోళం నెలకొంది. జిల్లాలో ఇప్పటి వరకు 29 ప్రభుత్వ, ఏడు ప్రైవేట్‌ ఆసుపత్రిలు మొత్తం 36కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 20పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఖమ్మంలోని మరో 14ప్రైవేట్‌ ఆసుపత్రులు వ్యాక్సినేషన్‌కు ముందుకు వచ్చాయి. వారికి పదిరోజుల క్రితం డీఐవో డాక్టర్‌ అలివేలు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు సూచించారు. ఆయా 14ప్రైవేట్‌ ఆసుపత్రులు వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్దంగా ఉన్నాయి. కానీ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఆయా ఆసుపత్రులకు లాగిన్‌ ఇవ్వలేదు. కనీసం టీకా ఉత్సవ్‌ సందర్బంగానైనా గుర్తించిన ప్రైవేట్‌ ఆసుపత్రులకు వ్యాక్సినేషన్‌కు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-04-11T05:54:29+05:30 IST