ఆక్సిజన్ ఉత్పత్తికి ఇబ్బందులు... స్టెరిలైట్ ప్లాంట్‌కు ఇస్రో బృందం...

ABN , First Publish Date - 2021-05-17T01:08:18+05:30 IST

స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు

ఆక్సిజన్ ఉత్పత్తికి ఇబ్బందులు... స్టెరిలైట్ ప్లాంట్‌కు ఇస్రో బృందం...

చెన్నై : స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఇస్రో నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఆక్సిజన్ ప్లాంట్‌లోని కోల్డ్ బాక్స్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కంపెనీలో ఆక్సిజన్ ఉత్పత్తి గురువారం ప్రారంభమైంది. ఆ మర్నాడే ఈ లోపం ఏర్పడటం దురదృష్టకరం. 


చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలోని తూత్తుకుడిలో ఈ కంపెనీ ఉంది. మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన మర్నాడే సాంకేతిక లోపం ఏర్పడటంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆక్సిజన్ ప్లాంట్‌లో ఉత్పత్తి పునఃప్రారంభమవడానికి కృషి జరుగుతున్నట్లు స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీకి చెందిన టెక్నికల్ టీమ్‌కు సహకరించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నుంచి నిపుణులు వచ్చారని తెలిపింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు కొన్ని చర్యలను ఈ బృందం సూచించిందని పేర్కొంది. ఈ సూచనలు మరమ్మతు ప్రక్రియను వేగవంతం చేయడానికి దోహదపడినట్లు తెలిపింది. తమకు సహకరించిన స్థానిక పరిపాలనా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపింది. 


రాష్టంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అత్యవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తిని ఈ ప్లాంట్ మే 13న ప్రారంభించింది. ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను కొన్ని ట్యాంకర్ల ద్వారా పంపించింది. 


Updated Date - 2021-05-17T01:08:18+05:30 IST