Abn logo
May 16 2020 @ 00:00AM

స్ర్కీన్‌ రంగు మారుతోంది.. ఏం చేయాలి? -టెక్‌ సందేహాలు

నా ఫోన్‌లో ట్విలైట్‌ అనే అప్లికేషన్‌ వాడుతున్నాను. రాత్రి సమయాల్లో కళ్లను రక్షించడం కోసం ఇది పనికొస్తుంది అని ట్రై చేశాను. అంతా బానే ఉంది కానీ, ఫోన్లో ఏదైనా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేద్దామని చూస్తుంటే ఇన్‌స్టలేషన్‌ జరిగే సమయంలో ఫోన్‌ స్ర్కీన్‌ అప్పటివరకు రెడ్‌ కలర్‌లో ఉన్నది కాస్తా కొన్ని క్షణాలు వైట్‌ కలర్‌లో మారిపోయి కనిపిస్తూ ఉంది. ఇలా అవకుండా ఉండాలంటే ఏం చేయాలి? 

- విశ్వనాథ్‌


రాత్రి సమయాల్లో ఫోన్‌ వాడేటప్పుడు ఫోన్‌  నుంచి వెలువడే బ్లూ లైట్‌ వల్ల నిద్రకు ఉపకరించే హార్మోన్‌ విడుదల అవదు. ఇలా జరగకుండా అడ్డుకోవడం కోసం మీరు వాడుతున్న ట్విలైట్‌ అనే యాప్‌తో పాటు ఫ్లక్స్‌ వంటి అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాస్తవానికి స్ర్కీన్‌ మీద ఒక ప్రత్యేకమైన రంగు పొరను ఏర్పాటు చేయడం ద్వారా మన కళ్ళకు నేరుగా నీలి కాంతి  చేరకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ఇలా ప్రత్యేకమైన పొరని ఏర్పాటు చేయడాన్ని ఆండ్రాయిడ్‌ పరిభాషలో స్ర్కీన్‌ ఓవర్‌లే అంటారు. ఇక అసలు విషయానికి వస్తే, ఏదైనా ప్రత్యేకమైన అప్లికేషన్‌ ఇలా స్ర్కీన్‌ ఓవర్‌లేగా పనిచేస్తున్నప్పుడు దాంట్లో అప్లికేషన్లు ఇన్‌స్టాల్‌ అవకుండా గూగుల్‌ అడ్డుకుంటుంది. సెక్యూరిటీ కారణాల వల్ల ఈ ఏర్పాటు చేస్తుంది. అందుకే అప్లికేషన్‌ ఇన్‌స్టలేషన్‌ జరిగేటప్పుడు తాత్కాలికంగా ఇలాంటి అప్లికేషన్లు డిసేబుల్‌ చేయబడతాయి. ఈ కారణంచేతే రెడ్‌ టింట్‌ బదులు తిరిగి వైట్‌ కలర్‌ కొద్ది క్షణాలు వస్తోంది. మీరు పూర్తిగా ట్విలైట్‌ అనే యాప్‌ అయినా  వాడటం మానేయాలి లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడమైనా ఆపేయాలి. లేదంటే  టెంపరరీగా స్ర్కీన్‌ మారిపోయినా చూసిచూడనట్లు ఉండాలి.వై-ఫై కాలింగ్‌ ఎలా పనిచేస్తుంది?


ఈమధ్య వై-ఫై కాలింగ్‌ అనే పేరు వినిపిస్తోంది. అది ఎలా పని చేస్తుందో తెలుపగలరు. 

- సుధేష్ణ, తెనాలి


మనం ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కి చేసే అన్ని కాల్స్‌ టవర్ల ఆధారంగా టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతూ ఉంటాయి.  అయితే ఈ విధానం వల్ల ఈ మధ్యకాలంలో టవర్ల మీద ఎక్కువ లోడ్‌ పెరగడం, టవర్‌ సామర్థ్యం తక్కువగా ఉండటం, ఇతర  సమస్యల కారణంగా కాల్‌ డ్రాప్స్‌ సమస్య ఎక్కువ అవుతున్న  సంగతి తెలిసిందే. దీని ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిందే వై-ఫై కాలింగ్‌. 

మీ ఇంట్లో గానీ, ఆఫీ్‌సలో గానీ ఇంటర్నెట్‌ సదుపాయం ఉండి, వై-ఫై ద్వారా దాన్ని పొందగలిగితే, ఇక టవర్ల మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా నేరుగా వై-ఫై ద్వారా కాల్స్‌ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇంటర్నెట్‌ ద్వారా మనం చేసుకునే  వాట్సప్‌, ఫేస్‌టైమ్‌, స్కైప్‌ వంటివి వాయిస్‌ ఓవర్‌ ఐపీ కాల్స్‌గా  పరిగణించబడతాయి.  వాటికి భిన్నంగా మనం రోజూ వాడే టెలిఫోన్‌ ఎక్స్‌చేంజ్‌ల ద్వారానే ఈ వై-ఫై కాలింగ్‌  సదుపాయం పనిచేస్తుంది.స్టోరేజ్‌ ఫుల్‌... ఎందుకు?

నా ఫోన్లో నాకు గుర్తున్నంతవరకు పెద్దగా ఏమీ స్టోర్‌ చేసుకోలేదు. అయినా స్టోరేజ్‌ మొత్తం నిండిపోయినట్లు చూపిస్తోంది. దీనికి కారణమేమిటి? 

- ప్రతాప్‌, హైదరాబాద్‌

మన ఫోన్‌లో వాడే యాప్స్‌ జీబీల కొద్దీ డేటాబేస్‌ల రూపంలో స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. గూగుల్‌ సంస్థకి చెందిన ఫైల్స్‌ అనే యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని విశ్లేషిస్తే, ఏయే ఫైళ్లు, ఫోల్డర్లకి ఎంత మొత్తంలో స్థలం అవసరం అవుతోంది అన్నది అర్థమవుతుంది. సహజంగా తాము తీసే ఫొటోలు, వీడియోల పరిమాణాన్ని చాలామంది పెద్దగా లెక్కలోకి తీసుకోరు. ఒక్కసారి మీరు గమనిస్తే  మీ ఫోన్లో క్యాప్చర్‌ చేయబడి ఉన్న వేల ఫోటోలు, వీడియోలు కూడా చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి.  కొన్ని సందర్భాలలో కొన్ని ఆండ్రాయిడ్‌ మాల్‌వేర్లు జంక్‌ ఫైళ్లతో స్పేస్‌ మొత్తాన్ని నింపేసే  స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాంటి వాటిని యాంటీవైరస్‌లు కూడా గుర్తించలేవు కాబట్టి ఫ్యాక్టరీ రీసెట్‌ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.


Advertisement
Advertisement
Advertisement