Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 20 Jul 2021 11:35:49 IST

దంతం క్షేమం!

twitter-iconwatsapp-iconfb-icon
దంతం క్షేమం!

ఆంధ్రజ్యోతి(20-07-2021)

మిక్సీ జార్‌ వేగం, బ్లేడ్ల పదును తగ్గకుండా జాగ్రత్తగా వాడుకుంటాం!

ఎప్పుడైనా మొరాయిస్తే, వెంటనే మరమ్మతు చేయిస్తాం!

మరి మన నోరు కూడా మిక్సీ జార్‌ లాంటిదే!

నోరు కదిలించి, ఆహారం తిననిదే రోజు గడవదు!

ఆ క్రమంలో... దంతాలు పాడవుతూ ఉంటాయి, చిగుళ్లు చీకాకు పెడుతూ ఉంటాయి!

మరి వాటిని సమయానికి రిపేర్‌ చేయిస్తున్నామా?

నోటి సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేసుకోకపోతే లేనిపోని చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది!

కాబట్టి... నోటికి సంబంధించిన ఇబ్బందులను తక్షణమే దంతవైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి!

ఈ కొవిడ్‌ కాలంలో నోటి ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలి!


వయసు మీద పడితే దంతాలు ఊడిపోవడం సహజం అనేది అపోహ. నిండు నూరేళ్లూ దంతాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. అయితే అంతకంటే ముందే ఊడిపోతున్నాయి అంటే వాటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. చిగుళ్లు వదులైనా, దంతాలు పుచ్చిపోయినా, ఊడిపోయిన దంతాల ఖాళీలను పెట్టుడు దంతాలతో భర్తీ చేయకపోయినా, గారను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోయినా దంతాల ఆరోగ్యం కుదేలవుతుంది. ఈ సమస్యలన్నీ దంతాలకు పునాదిగా ఉండే దవడ ఎముకను బలహీనపరుస్తాయి. ఫలితంగా దంతాల ఆయుష్షు తరిగిపోతుంది.


నోటి సమస్యలు

ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్‌తో దంతాలను ఎడాపెడా రుద్దేసి, నాలుకను గీకేసి తర్వాత మిగతా పనుల్లో పడిపోతాం. ఏం తింటున్నా, ఎంత నములుతున్నా ఆ పనంతా దంతాలే చేస్తున్నాయనే స్పృహ మనకు ఉండదు. తట్టుకోలేనంత నొప్పి మొదలైతే తప్ప మన నోట్లో దంతాలనేవి ఉన్నాయనే విషయం గుర్తుకురాదు. దంతాల ఏర్పాటు ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరి పలువరుస తీర్చిదిద్దినట్టు ఉంటే, మరొకరిది ఎగుడుదిగుడుగా ఉండవచ్చు. ఆ క్రమంలో హెచ్చుతగ్గులు, వంకర్లు లేకుండా చూసుకోవడం అవసరం. ఒకవేళ దంతాలు ఊడితే ఆ ప్రదేశంలో ఏర్పడిన ఖాళీని కృత్రిమ దంతాలతో భర్తీ చేయించుకోవాలి. దంతాల్లో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. అవేంటంటే...


ఖాళీలు చేసే చేటు: ఊడిపోయిన దంతానికి ఇరువైపులా ఉండే దంతాలు క్రమేపీ ఆ జాగాలోకి ఒరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ కింద పలువరసలో ఖాళీ ఏర్పడితే పైదవడలో దానికి అభిముఖంగా ఉండే దంతం దిగువకు జారడం మొదలుపెడుతుంది. దాంతో చిగుళ్లు కూడా వదులవుతాయి. ఫలితంగా ఇతర దంతాల మధ్య ఆహారపదార్థాలు ఇరుక్కుని ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి.


పదునెక్కే దంతాలు: నిరంతరంగా పనిచేసే దంతాలు నమలడం మూలంగా ఒరిపిడికి గురై, వాటి అంచులు పదునుగా మారుతూ ఉంటాయి. ఆ అంచులను దంతవైద్యుల చేత సరిచేయించుకుంటూ ఉండాలి. లేదంటే ఆ అంచుల వల్ల నాలుక మీద గాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ గాయాలు దీర్ఘకాలంలో కేన్సర్‌గా కూడా మారవచ్చు.


గార తొలగించాలి: దంతాలు రంగు మారడానికి, బలహీనపడడానికి ప్రధాన కారణం గార. దీన్ని తొలగించుకోకపోతే చిగుళ్లు వదులై, దంతాలు పట్టు తప్పుతాయి. 


చిగుళ్ల నుంచి రక్తస్రావం: చిగుళ్లకు బ్యాక్టీరియా సంబంధ ఇన్‌ఫెక్షన్‌ సోకడం మూలంగా ఎర్రబడి, వాచి, రక్తస్రావం జరుగుతూ ఉండవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్‌ పెరియోడాంటైటిస్‌గా మారకుండా ఉండాలంటే ప్రారంభంలోనే శ్రద్ధ వహించాలి.

దంతం క్షేమం!

దుర్గంధం ఇలా దూరం!

నోటి దుర్గంధానికి కారణం చిగుళ్ల సమస్యలు. దంతాలను పట్టి ఉంచే చిగుళ్ల దగ్గర గార పేరుకుంటున్నా, దంతాల మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కుంటున్నా నోటి నుంచి చెడు వాసన వెలువడవచ్చు. నోట్లో మిగిలిపోయిన పదార్థాలను బ్యాక్టీరియా బ్రేక్‌ చేసే సమయంలో సల్ఫర్‌ కాంపౌండ్లు విడుదల అవుతాయి. ఫలితంగా దుర్గంధం వెలువడుతుంది. నోటి దుర్గంధానికి ఇతర కారణాలూ ఉంటాయి. అవేంటంటే...


టాన్సిల్‌ ఇన్‌ఫెక్షన్‌: దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉన్నా, టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు లోనైతే వాటి నుంచి వెలువడే దుర్గంధం నోటి దుర్వాసనను తలపిస్తుంది. ఇలాంటి సందర్భంలో టాన్సిల్స్‌ను తొలగించుకుంటే సమస్య తొలగిపోతుంది.


నోరు ఎండిపోవడం: నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే నోట్లో తడి కొనసాగుతూ ఉండాలి. లాలాజలం నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉంటుంది. అయితే వ్యాధులు, చికిత్సలు, డీహైడ్రేషన్‌.. ఇలా వేర్వేరు కారణాల వల్ల నోరు ఎండిపోతుంటే నోటి దుర్గంధం తలెత్తడం సహజం. ఈ పరిస్థితికి కారణాన్ని గుర్తించి, సరిదిద్దుకోవాలి. 


ఫ్లాసింగ్‌ తప్పనిసరి!

దంతాలు, చిగుళ్ల సమస్యలు వాటిలో ఇరుక్కునే ఆహారపదార్థాలతో మొదలవుతాయి. టూత్‌బ్రష్‌తో దంతాల్లో ఇరుక్కున్న వ్యర్థాలు పూర్తిగా బయటకు రాకపోవచ్చు. ఇలాంటప్పుడు ఫ్లాసింగ్‌ విధానాన్ని అనుసరించాలి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఫ్లాసింగ్‌ దారాన్ని దంతాల మధ్య కదిలిస్తూ, దంతాలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. వీలైతే రోజుకు రెండు సార్లు ఫ్లాసింగ్‌ చేసుకుంటూ ఉండాలి. 


అనువైన బ్రష్‌!

దంతాలను శుభ్రం చేసుకోవడం కోసం తోచిన బ్రష్‌ను ఎంచుకోకూడదు. దంతాల నిర్మాణానికి తగ్గట్టు, దంతాల సందుల్లోకి, దంతాల వెనకవైపుకీ చొరబడి శుభ్రం చేయగలిగే మెడికేటెడ్‌ బ్రష్‌ను ఎంచుకోవాలి. బ్రిసిల్స్‌ మరీ బిరుసుగా, లేదా మరీ మృదువుగా ఉండకూడదు. కనీసం రెండు నిమిషాలకు తగ్గకుండా బ్రష్‌ చేసుకోవాలి. దంతధావనానికి వేరుశెనగ గింజ పరిమాణం పేస్ట్‌ సరిపోతుంది. నాలుకను శుభ్రం చేయడం కోసం స్టీల్‌ టంగ్‌ క్లీనర్లకు బదులుగా ప్లాస్టిక్‌వి వాడుకోవాలి. అవి పదునుగా ఉండకూడదు. 


అసిడిటీతో దంతాలకు చేటు!

అసిడిడీ కారణంగా ఆమ్లంతో కూడిన జీర్ణ రసాలు త్రేన్పులతో పాటు నోట్లోకి ఎగజిమ్ముతాయి. ఇలాంటి పరిస్థితి వల్ల దీర్ఘకాలంలో దంతాల పై ఎనామిల్‌ తొలగిపోయి దంతాలు సెన్సిటివ్‌గా మారతాయి. దాంతో చల్లని, వేడి ద్రవాలు, పదార్థాలు తినలేని పరిస్థితి తలెత్తవచ్చు. కాబట్టి అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు వైద్యులను కలసి సమస్యను సరిదిద్దుకోవాలి.

దంతం క్షేమం!దంతాలు ఇలా భద్రం!

ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్‌ చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి.

ప్రతి రోజూ అద్దంలో దంతాలు, చిగుళ్లను పరీక్షించుకుంటూ ఉండాలి.

దంతాల మీద ఏర్పడే నల్లని చుక్కలు దంతం పుచ్చిపోతుంది అనడానికి సూచనలు. వెంటనే వైద్యులను కలవాలి.

నాలుక, చిగుళ్లు, లోపలి బుగ్గల్లో మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు.

స్వీట్స్‌, శీతల పానీయాలు తగ్గించాలి.

ప్రతి రోజూ ఫ్లాసింగ్‌ చేయాలి.

వాటర్‌ ఫ్లాసర్‌ను ఉపయోగించి, దంతాల సందుల్లో ఇరుక్కున్న పదార్థాలను తొలగించుకోవాలి.


మెనోపాజ్‌తో చిగుళ్ల సమస్యలు

మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అడుగంటుతుంది. దాంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం అడపాదడపా కనిపిస్తూ ఉండవచ్చు. ఈ సమస్యకు మూలకారణాన్ని సరిదిద్దినప్పుడే రక్తస్రావం ఆగుతుంది. అలాగే కొందరికి చిగుళ్ల నుంచి రక్తస్రావం వంశపారంపర్యంగా కూడా సంక్రమించే వీలుంది.


నోట్లో మ్యూకోర్‌మైకోసిస్‌

కొవిడ్‌ లక్షణాల్లో రుచి కోల్పోవడం ఒకటని మనందరికీ తెలుసు. అయితే నోట్లో అకారణంగా మంట, నొప్పి మొదలైనా వాటిని కొవిడ్‌ సూచనలుగానే భావించాలి. ఈ లక్షణాలు మొదలైన వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం అవసరం. అలాగే కొవిడ్‌ తదనంతర ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ మ్యూకోర్‌మైకోసిస్‌ను కూడా ప్రారంభంలోనే గుర్తించాలి. ఇందుకోసం కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత నోరు మంటగా ఉంటున్నా, పుండ్లు ఏర్పడినా, నాలుక, చిగుళ్లు, లోపలి బుగ్గల్లో కొంత మేరకు చర్మం రంగు మారినా, రక్తస్రావం, నొప్పి మొదలైనా మ్యూకోర్‌మైకోసిస్‌గా అనుమానించాలి. ఈ ఇన్‌ఫెక్షన్‌ నొప్పితో లేదా నొప్పి లేకుండా కూడా ఉండవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా దంత వైద్యులను సంప్రతించాలి. బయాప్సీతో వ్యాధిని నిర్థారించుకుని, తీవ్రతను బట్టి మందులతో లేదా సర్జరీతో ఈ ఇన్‌ఫెక్షన్‌ను వైద్యులు సరిదిద్దుతారు. ప్రారంభంలోనే గుర్తిస్తే యాంటీబయాటిక్స్‌, నొప్పి తగ్గించే మాత్రలు, పుక్కిలించే యాంటీసెప్టిక్‌ మందులు, నోట్లో పూసే పైపూత మందులతో ఇన్‌ఫెక్షన్‌ను అదుపు చేయవచ్చు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.