Osmania Hospital లో మహిళలను టీజ్ చేస్తూ రెచ్చిపోతున్న అంబులెన్స్‌ డ్రైవర్లు!

ABN , First Publish Date - 2021-08-21T16:38:30+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రికి ఎక్కువ శాతం రోగులు జిల్లాల నుంచి వస్తుంటారు. ..

Osmania Hospital లో మహిళలను టీజ్ చేస్తూ రెచ్చిపోతున్న అంబులెన్స్‌ డ్రైవర్లు!

  • అడిగిన వారిపై దౌర్జన్యం
  • తాజాగా క్యాంటీన్‌లోకి చొరబడి క్యాషియర్‌పై దాడి
  • అధికారుల పర్యవేక్షణా లోపంతోనే పెట్రేగుతున్న వైనం

ఉస్మానియా ఆస్పత్రికి ఎక్కువ శాతం రోగులు జిల్లాల నుంచి వస్తుంటారు.  ఆస్పత్రి ఓపీ గేటు వద్ద అఫ్జల్‌గంజ్‌ ఔట్‌ పోస్ట్‌, పాత భవనం వెనకాల అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో దాదాపు వంద మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా అనుమతులు లేకుండా ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు ఆస్పత్రిలోకి ప్రవేశించి ఓపీ ప్రాంగణంలో తిష్ఠ వేస్తుంటారు. గుంపులుగా చేరి ఒకరినొకరు తిట్టుకోవడం, రోగి సహాయకులుగా వచ్చిన మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. 


ఈ విషయంలో పలుమార్లు మందలించే ప్రయత్నం చేయగా తమపై కూడా దాడులకు దిగుతున్నారని వార్డు బాయ్‌లు, ఇతర సిబ్బంది వాపోయారు. ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్‌ షాపులు, క్యాంటీన్‌, ఎస్‌టీడీ నిర్వాహకులకు డ్రైవర్లు ప్రతి నిత్యం చుక్కలు చూపిస్తున్నారని ఆయా షాపుల్లో పనిచేస్తున్న వారు ఆవేదన చెందుతున్నారు. స్థానికంగా ఉండే యువకులే ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు కావడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు ఇతరులు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో డ్యూటీ ఆర్‌ఎంఓలు పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి వ్యవహారాలు పోలీసుల వరకు వెళ్లడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఫిర్యాదు చేసినా మారని తీరు...

స్థానికంగా ఉండే యువకులు ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఉస్మానియాలో అక్రమంగా పార్క్‌ చేసి జిల్లాలకు వెళ్లే రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారని కొంత కాలంగా ఫిర్యాదులు రావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ పలు మార్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి ఆయన కనిపించిన ప్రతిసారి డ్రైవర్లు బెదిరింపు ధోరణిలో చూస్తున్నారని, అధికారులు, సిబ్బంది విషయంలోను ఇలాగే చేస్తున్నారని సమాచారం.  దీంతో ఆస్పత్రిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల పార్కింగ్‌ను నిషేధించడంతో ఉస్మానియా పాత భవనం ప్రహరీకి ఆనుకొని రోడ్డుపై అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు అక్రమ పార్కింగ్‌లు చేస్తున్నారు.

Updated Date - 2021-08-21T16:38:30+05:30 IST