మిరప రైతుకు కన్నీరు

ABN , First Publish Date - 2021-10-24T04:59:52+05:30 IST

మిరప సాగు చేసిన రైతన్నకు కన్నీరు మిగిలింది. వైరస్‌ సోకి వందల ఎకరాల్లో పంట ఎండిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది.

మిరప రైతుకు కన్నీరు
మాలపల్లిగ్రామంలో వైరస్‌ సోకి ఎండిన మిరపపంట

  1. పంట చేతికందే సమయంలో వైరస్‌ 


మంత్రాలయం, అక్టోబరు 23: మిరప సాగు చేసిన రైతన్నకు కన్నీరు మిగిలింది. వైరస్‌ సోకి వందల ఎకరాల్లో పంట ఎండిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. మండలంలో దాదాపు 1200 నుంచి 1300 ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఎల్లెల్సీ, జీఆర్పీ పైపులైన్‌ ఉండటం వల్ల అప్పులు చేసి ఎకరాకు రూ.60 నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేశారు. అయితే మాలపల్లి, వగరూరు, తిమ్మాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 400 ఎకరాల్లో మిరపకు వైరస్‌ సోకింది. మాలపల్లిలో సద్దల ఈరన్న, గువ్వల హనుమంతు, తాయప్ప, చంద్ర, బుడ్డప్ప, నాగన్న, లింగన్న, ఆదాము, మల్లేసు, తిక్కన్న, ఉరుకుందు తదితర రైతులేగాక అనేక మంది మిరప సాగు చేసి నష్టపోయారు. పురుగు మందును పిచికారీ చేసినా పంటను కాపాడుకోలేకపోయారు. దీంతో కొందరు పంటను పీకేస్తే మరికొందరు పశువులకు వదిలేశారు. 


మా దృష్టికి రాలేదు


మాలపల్లిలో మిరప పంటకు వైరస్‌కు సోకిన విషయం మా దృష్టికి రాలేదు. వాతావరణ మార్పు వల్ల కాండం కుళ్లుతో మిరప పంటకు నష్టం జరిగింది. మాలపల్లి రైతు భరోసా కేంద్రానికి వెళ్లి రైతులు ఫిర్యాదు చేసే సలహాలు, సూచనలు ఇస్తాం.     


- శివశంకర్‌, ఏవో


పంటను తొలగించాడు


కోసిగి: మిరప పంట కోతకు వచ్చే సమయంలో వేరుకుళ్లు వైరస్‌ సోకింది. రూ.4 లక్షల మేర పంటపై పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది. దీంతో చేసేదేమీ లేక సదరు రైతు పంటను తొలగించేశాడు. మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన ముకురయ్య అనే రైతు తన మూడెకరాల పొలంలో మిరప పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.4 లక్షల మేర అప్పు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో వేరుకుళ్లు వైరస్‌ సోకడంతో పంట పూర్తిగా కుళ్లిపోయింకిర ఏం చేసినా పంటను కాపాడుకోలేమని భావించిన రైతు శుక్రవారం కూలీలను పెట్టి ఆ పంటను తీసివేయించాడు. అనంతరం ట్రాక్టర్‌ ద్వారా పొలాన్ని టిల్లర్‌ కొట్టేశాడు. సుమారు రూ.4 లక్షల మేర పెట్టుబడి నేలపాలైందని, ఇలా అయితే తాము ఎలా బాగుపడుతామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క ముకురయ్యదే పంటే కాదు.. మండలంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి.

Updated Date - 2021-10-24T04:59:52+05:30 IST